సీనియర్ నిర్మాత ఎస్ గోపాల్ రెడ్డి తనయుడు, నిర్మాత భార్గవ్ రెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందడం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదానికి గురిచేసింది. తెలుగులో ఎన్నో సినిమాలు నిర్మించిన భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత భార్గవ్ రెడ్డి రొయ్యల చెరువులు వ్యాపారం కూడా నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం చెన్నై నుంచి నెల్లూరు జిల్లా వాకాడకు వచ్చి రొయ్యల చెరువుని సందర్శించిన భార్గవ్ రెడ్డి ఆ తర్వాత వాకాడ బీచ్‌కి వెళ్లారని.. అనంతరం భార్గవ్ రెడ్డి ఆచూకీ కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది వాకాడ బీచ్‌లో వెతకగా అతడి శవం లభ్యమైనట్టు సమాచారం. బీచ్‌లో భార్గవ్ రెడ్డి శవం చూసి షాక్‌కి గురైన అతడి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్గవ్ రెడ్డి మృతిని అనుమాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న వాకాడ పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలావుంటే, భార్గవ్ రెడ్డి మృతిపై నటుడు, నిర్మాత విశాల్ రెడ్డి కన్నీటిపర్యంతమయ్యారు. భార్గవ్ రెడ్డికి కజిన్ బ్రదర్ అయిన విశాల్.. భార్గవ్ మృతిపై తీవ్ర విచారం వ్యక్తంచేశారు. భార్గవ్ ఇలా చేస్తారని అనుకోలేదని, అవకాశం లభిస్తే తానే సమస్యలు పరిష్కరించే వాడినని విశాల్ ఓ ట్వీట్ చేశారు. భార్గవ్ మృతి తీరని లోటని, సొంత అన్నయ్యను పోగొట్టుకున్నట్టుందని విశాల్ ఆవేదన వ్యక్తంచేశారు.


భార్గవ్ రెడ్డి మృతిది సహజ మరణమా, హత్యనా లేక ఆత్మహత్యనా అనే స్పష్టత లేకపోవడంతో అతడి మృతిని అనుమానాస్పద మృతి కింద కేసు నమోదుచేసిన పోలీసులు ఆ కోణంలోనే విచారణ జరుపుతున్నారు. అయితే, భార్గవ్ రెడ్డి మృతిపై విశాల్ చేసిన ట్వీట్ చూస్తే, భార్గవ్‌ది ఆత్మహత్యేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఏవో సమస్యలతో సతమతమైన కారణంగానే అతడు తనువు చాలించాడా అనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.