విశ్వరూపం 2 విడుదల అడ్డుకోవాల్సిందిగా హై కోర్టులో నిర్మాత పిటిషన్
న్యాయపరమైన చిక్కుల్లో విశ్వరూపం 2 సినిమా విడుదల
విశ్వరూపం మొదటి భాగం విడుదలైనప్పుడు ఆ సినిమా ఎన్ని సమస్యలు ఎదుర్కుందో అందరికీ తెలిసిందే. అలాగే ఇప్పుడు విశ్వరూపం 2 సినిమాను కూడా న్యాయపరమైన చిక్కులు వీడేలా లేవు. అవును, విశ్వరూపం 2 సినిమా విడుదలను అడ్డుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఓ తమిళ నిర్మాణ సంస్థ మద్రాస్ హై కోర్టుని ఆశ్రయించింది. మర్మయోగి సినిమా నిర్మాణం కోసం కమల్ హాసన్ తీసుకున్న డబ్బుని తిరిగి ఇచ్చే వరకు అతడు నటించిన విశ్వరూపం 2 సినిమాను విడుదల చేయకుండా ఆదేశాలు ఇవ్వాల్సిందిగా పిరమిడ్ సైమిరా అనే నిర్మాణ సంస్థ మద్రాస్ హై కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసింది. మర్మయోగి అనే సినిమా నిర్మాణం కోసం తమ వద్ద డబ్బులు తీసుకున్న కమల్ హాసన్ ఆ సినిమాను మధ్యలోనే ఆపేశారని, ఫలితంగా తాము ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని పిరమిడ్ సైమిరా కోర్టు దృష్టికి తీసుకొచ్చింది.
పిరమిడ్ సైమిరా నిర్మాణ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ ని మద్రాస్ హై కోర్టు విచారణకు స్వీకరించడంతో ఈ నెల 10వ తేదీన విడుదల కావాల్సి ఉన్న విశ్వరూపం 2 సినిమాకు న్యాయపరమైన చిక్కులు తప్పవా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ న్యాయపరమైన చిక్కులు దాటుకుని విశ్వరూపం 2 థియేటర్లలోకొస్తుందా లేదా అనేది తెలియాలంటే ఈ పిటిషన్ పై కోర్టు స్పందన వెలువడే వరకు వేచిచూడాల్సిందే.