సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'టైగర్ జిందా హై'  చిత్రం వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమా విడుదలను ఆపాల్సిందిగా డిమాండ్ చేస్తూ వాల్మీకి తెగకు చెందిన కొందరు యువకులు సల్మాన్ పై మండిపడ్డారు. బిగ్ బాస్ షో సందర్భంగా ఆ నటుడు తమ తెగను కించపరిచే వ్యాఖ్యలు చేశారని.. ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకొనే వరకు తాము సినిమా రిలీజ్‌ను ఆపాలని డిమాండ్ చేసినా నిర్మాతలు వినలేదని వారు పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అందుకే సల్మాన్ పై స్థానిక పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం తాము ఆ కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు. రాజస్థాన్‌లోని జైపూర్, కోట ప్రాంతాల్లో ఇప్పటికే థియేటర్ల వద్ద యువకులు బైఠాయించి, సల్మాన్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సినిమా పోస్టర్లను చించేసి..సల్మాన్ ఖాన్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. రాజస్థాన్ రాజధానిలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పలు థియేటర్ల వద్ద మార్నింగ్ షోలను నిలిపివేశారు. అలాగే పలు థియేటర్ల వద్ద పోలీసులను భారీస్థాయిలో మోహరించారు.


జోధ్ పూర్, అజ్మీర్, దౌసా, నసీరాబాద్ ప్రాంతాలలో కూడా షోలు బంద్ అయ్యాయి. ఇప్పటికే బిగ్ బాస్ షోలో సల్మాన్ చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేస్తూ.. బిగ్ బాస్ షో నిర్వాహకులపై కూడా చర్య తీసుకోవాలని  కోరుతూ జాతీయ షెడ్యూల్ కుల సంఘాల కమీషన్, కేంద్ర సమాచార ప్రసారాల శాఖకు లేఖ రాసింది.