ఇప్పటివరకు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ బారినపడి తాము వేధింపులకు గురవుతున్నారని తరచుగా మహిళా ఆర్టిస్టులు మాత్రమే ఆరోపించడం వింటూ వచ్చాం. ఇటీవలే నటి శ్రీరెడ్డి సైతం ఈ ఆరోపణలతోనే పరిశ్రమలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, అందుకు భిన్నంగా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ పేరిట కేవలం లేడీస్ మాత్రమే కాకుండా మగవాళ్లు కూడా వేధింపులకు గురవుతున్నారని ప్రముఖ నటుడు రవి కిషన్ పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు‌. ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన ఈ బోజ్‌పురి నటుడు రేసు గుర్రం సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమయ్యాడు. ఆ తర్వాత రాధ, లై, కిక్-2, సుప్రీం, ఎంఎల్ఏ వంటి చిత్రాల్లో విలన్ పాత్రలు పోషించి తెలుగు ఆడియెన్స్‌కి సుపరిచితుడయ్యాడు. తాజాగా ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న రవి కిషన్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌పై స్పందిస్తూ క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవలం మహిళలకు మాత్రమే సంబంధించిన అంశం కాదని, ఆమాటకొస్తే, కొందరు నటీమణులే మగవారిని వేధిస్తున్నారని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పాడు. 


క్యాస్టింగ్ కౌచ్ గురించి రవి కిషన్ మాట్లాడుతూ ఒకవేళ క్యాస్టింగ్ కౌచ్ కి లొంగిపోతే, తాత్కాలికంగా అవకాశాలు దొరుకుతుండవచ్చేమో కానీ దీర్ఘకాలంలో మిమ్మల్ని మీరు కోల్పోయినట్టేనని స్పష్టంచేశాడు. సినిమాల్లో అవకాశాల కోసం మనల్ని మనం అమ్ముకుంటే ఇక జీవితమే ఉండదు. క్యాస్టింగ్‌ కౌచ్‌తో జీవితంలో ఎంత సాధించినా ఆ క్యాస్టింగ్‌ కౌచ్‌ వల్లే సాధించామన్న ముద్ర పడిపోతుంది. ఆ తర్వాత ఎంత సాధించినా ఆ విజయానికి విలువ ఉండదు అని రవి కిషన్ అభిప్రాయపడ్డాడు.