Kalyanam Kamaneeyam Movie Review సంతోష్ శోభన్ సినిమాలు ఎంత సాఫ్ట్‌గా ఉంటాయో అందరికీ తెలిసిందే. అందరిలా మాస్ హీరో, మాస్ ఇమేజ్ సంపాదించాలని తాపత్రయ పడటం లేదు. ఓ నటుడిగా మంచి సినిమాలు తీయాలని అనుకుంటున్నాడు. అందుకే సంతోష్ శోభన్ సినిమాలు ఓ వర్గాన్ని ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇప్పుడు కళ్యాణం కమనీయం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా కథ, కథనాలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కథ
శివ (సంతోష్ శోభన్) బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. శ్రుతి (ప్రియా భవానీ శంకర్) శివ ఇద్దరూ ప్రేమించుకుంటారు. శ్రుతికి ఉద్యోగం రావడం, తన తల్లి ఆరోగ్యం బాగా లేకపోవడంతో త్వరగా పెళ్లి చేసుకోవాలని చూస్తుంటారు. ఇరు కుటుంబ సభ్యులు కలిసి శివ, శ్రుతి పెళ్లిని జరిపిస్తారు. భార్య ఉద్యోగానికి వెళ్తే ఇంట్లో ఖాళీగా కూర్చుంటాడు శివ. మొదట్లో శివ లైఫ్‌ అంతా బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది. అలాంటి శివ, శ్రుతి జీవితంలో జరిగిన మార్పులు ఏంటి? ఉద్యోగాన్వేషణలో శివకు ఎదురైన అనుభవాలు ఏంటి? శ్రుతికి తన ఆఫీస్‌లో కలిగిన సమస్యలు ఏంటి? అసలు శివ, శ్రుతి మధ్య దూరం ఎందుకు పెరుగుతుంది? చివరకు శివ, శ్రుతిలు కలుస్తారా? అన్నది కథ.


నటీనటులు
శివ పాత్రలో సంతోష్ శోభన్ చక్కగా నటించాడు. ఉద్యోగం సద్యోగం లేకుండా ఇంట్లో ఖాళీగా ఉంటూ, భార్య సంపాదన మీద బతికే కుర్రాడి పాత్రలో మెప్పించాడు. ఎమోషన్స్, కామెడీ ఇలా అన్ని రకాలుగా సంతోష్ శోభన్ ఆకట్టుకున్నాడు. ఇక ప్రియా భవానీ శంకర్ సైతం చక్కగా నటించింది. తెరపై ప్రియా భవానీ కనిపించిన తీరు కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. కేదార్ శంకర్, దేవీ ప్రసాద్ తమ తమ పాత్రలకు చక్కగా న్యాయం చేశారు. పవిత్రా లోకేష్ అమ్మగా ఆకట్టుకుంది. సద్దాం, సప్తగిరి నవ్వించారు. సత్యం రాజేష్‌ నెగెటివ్ పాత్రలో ఆకట్టుకున్నాడు. మిగిలిన పాత్రల్లో అందరూ తమ పరిధి మేరకు నటించారు.


విశ్లేషణ
కళ్యాణం కమనీయం కథ మరీ అంత పెద్దదేమీ కాదు. ప్రేమ, నమ్మకం ఉంటే సంసారం చక్కగా సాగిపోతుందని దర్శకుడు చెప్పదల్చుకున్నాడు. నమ్మకం ఉంటే ప్రతీ కళ్యాణం కమనీయంగా మారుతుందనే పాయింట్ మీద ఈ కథను రాసుకున్నాడు. అయితే భార్యాభర్తల మధ్య సంఘర్షణను మాత్రం ఆసక్తికరంగా రాసుకోలేకపోయాడు. కథ చిన్నదే కావడం, కథనం కూడా అక్కడక్కడే తిరిగినట్టుగా అనిపిస్తుంది.


అలా ఈ సినిమాలోని ప్రతీ ఎమోషన్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని చెప్పలేం. కొన్ని కొన్ని సీన్లు మరీ సిల్లీగా అనిపిస్తాయి. లాజిక్‌కు దూరంగా కనిపిస్తాయి. ప్రథమార్థంలోని కొన్ని సీన్లు మాత్రం ఇప్పటి జనరేషన్‌కు కనెక్ట్ అవుతాయి. సంపాదించే భార్య, పనీ పాట లేకుండా ఇంట్లో ఖాళీగా ఉండే భర్త అనే లైన్‌ను వాడుకుని స్క్రీన్ మీద ఎంతో కామెడీని, ఎమోషన్‌ను పండించే అవకాశం ఉన్నా కూడా దర్శకుడు ఆ దిశగా ప్రయత్నించనట్టు అనిపిస్తుంది.


ఈ సినిమాకు నిడివి చాలా ప్లస్ అవుతుంది. తక్కువ నిడివి ఉండటంతో ఎక్కువగా బోర్ కొట్టించలేదనిపిస్తుంది. అయితే ఈ సినిమా థియేటర్‌కు తక్కువ ఓటీటీకి ఎక్కువ అన్నట్టుగా అనిపిస్తుంది. ఓటీటీలో ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కే అవకాశం ఉంది. సంక్రాంతి రేసులో ఈ సినిమా భవిష్యత్ కష్టంగానే అనిపిస్తోంది. మ్యూజిక్ బాగుంది. పాటలు వినసొంపుగానే ఉన్నాయి. కొన్ని చోట్ల డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. కెమెరాపనితనం, ఎడిటింగ్, ఆర్ట్ వర్క్ ఇలా అన్నీ చక్కగా ఉన్నాయి. యూవీ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.


రేటింగ్ : 2.5


బాటమ్ లైన్ : కళ్యాణం కమనీయం.. ఓటీటీలోనే నయం


Also Read:  Veera Simha Reddy Review : వీర సింహా రెడ్డి రివ్యూ.. మెప్పించిన బాలయ్య, నొప్పించిన గోపీచంద్


Also Read: Vaarsudu Telugu Movie Review : విజయ్ వారసుడు రివ్యూ.. వంశీ పైడిపల్లి ఇక మారడు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి