ఇలాంటి వాళ్లను నమ్మి మోసపోవద్దు.. శేఖర్ కమ్ముల ఫేస్‌బుక్ పోస్ట్
జాదూగాళ్లను నమ్మి మోసపోవద్దు : శేఖర్ కమ్ముల
కుటుంబసమేతంగా సినిమా చూసే విధంగా భిన్నమైన చిత్రాలను తెరకెక్కించడంలో దిట్టగా పేరున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆయన పేరు చెప్పుకుని, అతడి సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి యువతను మోసం చేస్తోన్న ఓ మోసగాడిని సైబరాబాద్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తన పేరు వాడుకుని యువతను మోసం చేస్తోన్న జాదుగాడు ఊట్ల హన్మంత్ రెడ్డి అలియాస్ సంజయ్ అలియాస్ సుధీర్ విషయం తెలుసుకున్న శేఖర్ కమ్ముల నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరమే ఈ మోసం గురించి పోలీసుల దృష్టికొచ్చింది. శేఖర్ కమ్ముల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబరాబాద్ క్రైమ్ విభాగం పోలీసులు చాకచక్యంగా నిందితుడికి వలేసి పట్టుకున్నారు.
ఈ మొత్తం ఎపిసోడ్‌లో అసలు ఏం జరిగిందనే వివరాలను తన ఫేస్‌బుక్ పేజ్ ద్వారా అందరికీ తెలియచెప్పిన శేఖర్ కమ్ముల.. దయచేసి ఇటువంటి మోసగాళ్లను నమ్మి మోసపోవద్దని సూచించారు. తమతో కలిసి పనిచేసే వారికి తామే పారితోషికం రూపంలో డబ్బులు ఇస్తాం కానీ ఇలా డబ్బులు వసూలు చేసి మోసం చేయం అని అందరికీ అర్థమయ్యే భాషలో వివరించారు.