నటీనటులు : రిషి, షెల్లీ, రవి కాలే, దేవయాని శర్మ, జాఫర్ సాదిక్, నితిన్ ప్రసన్న, కామాక్షీ భాస్కర్ల, మణికందన్ తదితరులు
స్టోరీ, డైరెక్షన్ : మహి వి రాఘవ్
నిర్మాతలు : మహి వి రాఘవ్, చిన్నా వాసుదేవ్ రెడ్డి
మ్యూజిక్ : శ్రీరామ్ మద్దూరి
సినిమాటోగ్రఫీ : షణ్ముగ సుందరం 
ఎడిటింగ్ : శ్రవణ్ కటికనేని
విడుదల తేదీ: జూన్ 15, 2023
ఓటీటీ వేదిక : డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
ఎపిసోడ్స్ : 9 ఎపిసోడ్స్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Shaitan Web Series Review and Rating in Telugu: పాఠశాల, ఆనందో బ్రహ్మ, యాత్ర వంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు మహి వి రాఘవ్ డైరెక్ట్ చేసిన సైతాన్ వెబ్ సిరీస్ ఆడియెన్స్ ముందుకొచ్చేసింది. రిషి, షెల్లీ, రవి కాలే, దేవయాని శర్మ, జాఫర్ సాదిక్ ప్రధాన పాత్రల్లో ... నితిన్ ప్రసన్న, కామాక్షీ భాస్కర్ల, మణికందన్ తదితరులు ఇతర పాత్రల్లో నటించిన సైతాన్ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నేడే విడుదలైంది. మొత్తం 9 ఎపిసోడ్స్ ఉన్న ఈ వెబ్ సిరీస్ మొత్తం అడ్డూఅదుపు లేని బూతులమయం అని సైతాన్ ట్రైలర్ చూసినప్పుడే అర్థమైంది. మరి టోటల్ వెబ్ సిరీస్ ఎలా ఉంది అనేది ఇప్పుడు ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి.


కథ: 
అన్నమయ్య జిల్లా మదనపల్లె నేపథ్యంతో మొదలయ్యే ఈ కథలో అవినీతి, అన్యాయం, అరాచకం రాజ్యమేలుతున్న తరుణంలో నక్సలైట్స్, పోలీసులకు మధ్య జరిగిన పోరు చుట్టూనే సైతాన్ వెబ్ సిరీస్ తిరుగుతుంది. సావితి ( షెల్లి ) అనే మహిళకు ముగ్గురు సంతానం. భర్త తోడు లేని షెల్లి.. తన ముగ్గురు పిల్లలైన బాలి ( రిషి ) జయప్రద ( దివియాని శర్మ), గుమతి ( జాఫర్ సాదిఖ్ ) లను పోషించుకోవడం కోసం సావిత్రి ఒక అవినీతిపరుడైన పోలీసు అధికారికి పడక సుఖం పంచే మహిళ పాత్రలో కనిపిస్తుంది. దాంతో సమాజం సావిత్రిని ఒక వ్యభిచారిగా భావించి చిన్నచూపు చూడటం మొదలుపెడుతుంది. 


సమాజం చిన్నచూపు, అవమానాల మధ్య పెరిగిన బాలి పరిస్థితుల ప్రభావంతో నేరస్తుడిగా మారి నక్సలైట్లలో చేరుతాడు. అదే సమయంలో ఎన్నో కష్టాలను దిగమింగుకుని రోజులు వెళ్లదీసుకొస్తున్న బాలి తల్లి, తోబుట్టువులు కూడా తమ మనుగడ కోసం ఎంతటి తీవ్ర పరిణామాలను ఎదుర్కోవడానికైనా, ఎక్కడికెళ్లడానికైనా రెడీ అవుతుంది. మరోవైపు నక్సలైటుగా మారిన బాలి ప్రభావం అతడి కుటుంబంపై ఎలాంటి దుష్బ్రభావాన్ని చూపుతుంది.. ఆ తరువాత వచ్చే సమస్యలను ఆ కుటుంబం ఎలా ఎదుర్కొంది అనేదే సైతాన్ స్టోరీ.


ప్లస్ పాయింట్స్ : 
నక్సలైట్లు, పోలీసులు, క్రిమినల్స్ మధ్య జరిగే పోరును కథాంశంగా తీసుకోవడం అనేదే కొత్తదేమీ కాకపోయినప్పటికీ.. ఈ స్టోరీని తెరకెక్కించిన తీరు మాత్రం ఆడియెన్స్ ని కచ్చితంగా కట్టిపడేస్తుంది అనే చెప్పుకోవచ్చు. ముందుగా ఆడియెన్స్ ని స్టోరీలోకి తీసుకెళ్లేది ఏంటంటే.. ఒక కుటుంబంపై తీవ్ర స్థాయిలో జరిగిన అరాచకాలు ఆ కుటుంబాన్ని ఎలా రాటుదేలిపోయేలా చేస్తాయి అనేది ఆడియెన్స్ ని ఈ వెబ్ సిరీస్ లోకి తీసుకెళ్లేలా చేస్తాయి. సైతాన్ వెబ్ సిరీస్ చూసే వారికి అందులోని నేరాలు, బూతులతో కథ అంతా క్రైమ్ కహానిని తలపించినప్పటికీ.. కథలో ఉన్న పాత్రలకు మాత్రం అది బతుకు పోరాటం. బతకాలి అంటే ఎంత పెద్ద నేరమైనా వెన్నతో పెట్టిన విద్యలా చేయాల్సిందే.


బాలి పాత్రలో కన్నడ నటుడు రిషి అదుర్స్ అనిపించాడు. ఆ పాత్రకు తగిన నటుడిలా కనిపించాడు. యాక్షన్ సీక్వెల్స్ తీసుకున్నా.. ఎమోషనల్ సీన్స్ తీసుకున్నా.. బాలి పాత్రకు పర్‌ఫెక్టుగా ఫిట్ అయ్యాడు. అలాగే నటుడు రవి కాలె కూడా తన పాత్రకు న్యాయం చేశాడు. షెల్లీ, దేవియాని శర్మ, జాఫర్ సాధిక్, కామాక్షి భాస్కర్ల తమ పాత్రలకు న్యాయం చేశారు. 


ఒక మనిషి నేరాలవైపు ఎందుకు మళ్లాల్సి వచ్చింది, తోడు లేని ఒక మహిళ పట్ల సమాజం చూసే చిన్న చూపు ఎలా ఉంటుంది ? మహిళ అంటే అంగడి సరుకు అని భావించే సమాజం వేధించే వేధింపులకు ఆ మహిళ రాటుదేలిపోతే ఎలా ఉంటుంది ? అసలు ఎందుకు బాలి కుటుంబం అంత కర్కషంగా తయారైంది, ఏ పరిస్థితుల్లో ఆ కుటుంబం మొత్తం నేరాలను అలవోకగా చేసే స్థాయికి చేరింది అనే అంశాలు వెబ్ సిరీస్ చివరి ఎపిసోడ్స్ లో ప్రజెంట్ చేయడంతో వెబ్ సిరీస్ చివరి వరకు ఆడియెన్స్ లో ఆసక్తిని పెంచేలా చేసింది. 


మైనస్ పాయింట్స్ :
పోలీసులకు , నక్సలైట్లకు మధ్య జరిగే పోరు నేపథ్యంతో చాలా సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చాయి కానీ ఎందులోనూ నక్సలైట్ల ఐడియాలజీ ఏంటి ? వారి సిద్ధాంతాలు ఏంటనే అంశాలపై ఫోకస్ చేసినవి మాత్రం లేవు. దురదృష్టవశాత్తుగా సైతాన్ వెబ్ సిరీస్ కూడా ఆ జాబితాలోనే చేరిపోయింది. కథ అంతా నక్సలైట్లు, పోలీసుల మధ్యే తిరిగినప్పటికీ.. ఎవో ఒకట్రెండు సన్నివేశాలు మినహా నక్సలైట్ల నేపథ్యం గురించి చెప్పింది లేదు. 


సాంకేతిక నిపుణులు:
సమాజంలో జరిగే కొన్ని పరిణామాలనే కథంశంగా ఎంచుకున్న మహి వి రాఘవ్.. ఇందులోని నేరాలను చూపించడంలో ఆడియెన్స్ ని వాస్తవిక ప్రపంచంలోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యాడు. అయితే, నక్సలైట్ల నేపథ్యం గురించి పెద్దగా సన్నివేశాలు లేకుండానే నక్సలైట్లకు, పోలీసులకు మధ్య పోరుగా చూపించడం కొంత వెలితిగా అనిపించే అంశం. బహుశా సమాజంలో అవినీతి బారిన పడిన వాళ్లు, అరాచకాలు ఎదుర్కొన్న బాధితులే అడవి బాట పడుతున్నారు అనే కోణంలో కథను మల్చుకోవడమే కానీ.. అలాగని నక్సలైట్లను గొప్పగా చూపించొద్దు అనే భావన కూడా ఇందుకు ఒక కారణం అయి ఉండొచ్చు. అక్కడక్కడా వచ్చే సన్నివేశాలు అందరూ ఊహించేవిగానే ఉండటం, రిపీటెడ్ క్రైమ్స్ ఒక మైనస్ పాయింట్.  


శ్రీరామ్ మద్దూరి బ్యాగ్రౌండ్ స్కోర్, షణ్ముగ సుందరం సినిమాటోగ్రఫి కథకు సరిగ్గా సూటయ్యాయి. అలాగే ఒక్కో ఎపిసోడ్ ని సగటున 25 నిమిషాల నిడివిలో కథ చెప్పేలా షోను రన్ చేయడంలో ఎడిటర్ శ్రవణ్ కటికనేని కూడా విజయం సాధించాడు. 


ఫైనల్‌గా చెప్పేదేంటంటే..
సైతాన్ వెబ్ సిరీస్ చూసేంతసేపు కొంత ఆసక్తికరంగానే అనిపించినప్పటికీ.. షో పొడవునా వచ్చే ప్రెడిక్టబుల్ సీన్స్ కొత్తదనాన్ని ఇవ్వవు. అన్నింటికిమించి ఇందులో ఉండే బూతులు ఈ వెబ్ సిరీస్‌ని మాస్ ఆడియెన్స్‌కే పరిమితం చేసే ప్రమాదం ఉంది. క్రైమ్ సీక్వెల్స్‌కి మించిన బూతులు ఫ్యామిలీ ఆడియెన్స్, క్లాస్ ఆడియెన్స్ సైతాన్ వైపు కనీసం కన్నెత్తి చూసే సాహసం చేయలేరు. క్రైమ్ కహానీలను ఇష్టపడే వారికి ఓకే అనిపించే వెబ్ సిరీస్ సైతాన్.


రేటింగ్: 3/5