శ్రీదేవి అకాల మరణం వెనుక కారణం ఏంటి ? దుబాయ్ నుంచి వెలువడుతున్న వార్తల్లో ఎంతమేరకు నిజం వుంది ? ఆమె నిజంగానే ప్రమాదవశాత్తు నీళ్లలో మునిగి చనిపోయిందా ? లేక ఎవరైనా దురుద్దేశపూర్వకంగా కుట్రపన్నారా ? ఒకవేళ కుట్రపన్నడమే జరిగితే, ఆ అవసరం ఎవరికి వుంటుంది ? ఏముంటుంది ? ఇవే ఇప్పుడు శ్రీదేవి అభిమానులను తొలిచివేస్తోన్న సందేహాలు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ తెలుగు వార్తా సంస్థ 'సాక్షి' శ్రీదేవికి సమీప బంధువైన ఆమె బాబాయి ఎం వేణుగోపాల్‌ని సంప్రదించి పలు ఆసక్తికరమైన విషయాలు అడిగి తెలుసుకుంది. వేణుగోపాల్ వద్ద నుంచి సాక్షి ప్రతినిధి సేకరించి, ప్రచురించిన సమాచారం ప్రకారం ఆయన చెప్పిన పలు ఆసక్తికరమైన అంశాల్లోంచి కొన్ని ముఖ్యమైన అంశాలు ఇలా వున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రీదేవి అమ్మ రాజేశ్వరమ్మ మా అమ్మకు స్వయానా అన్న కూతురు. నాకు వరుసకు వదిన అవుతుంది. శ్రీదేవి వాళ్ల పిన్నమ్మ అనసూయమ్మను మా పెదనాన్న కొడుకుకు ఇచ్చారు. రాజేశ్వరమ్మ తమ్ముడికి మా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేశాం. రాజేశ్వరమ్మ సినిమాల్లో సైడ్‌ క్యారెక్టర్స్‌ చేస్తున్న రోజుల్లోనే శివకాశీలో అయ్యప్పన్‌ని పెళ్లి చేసుకున్నారు. రాజేశ్వరమ్మ పెళ్లికి మేం బంధువులమంతా వెళ్లాం. అలా శ్రీదేవి తల్లిదండ్రులతో మాకు దగ్గరి బంధుత్వం వుంది.


శ్రీదేవికి తిరుపతితో ప్రత్యేకమైన అనుబంధం కలిగి వుంది. తిరుపతిలో మా బంధువల ఇళ్లు అన్నీ దగ్గర దగ్గరే ఉండేవి. శ్రీదేవి వాళ్ల ఇంటికి ఒక నాలుగు ఇళ్లు అవతల శ్రీదేవి వాళ్ల పిన్ని అనసూయమ్మ ఇల్లు ఉండేది. అలా చిన్నప్పుడు శ్రీదేవి మా అందరి ఇళ్లలో ఆడుకుంటూ మాతో చనువుగా వుండేది. శ్రీదేవి వాళ్ల నాన్నగారు తమిళియన్‌ కాబట్టి అమ్మయ్యంగార్‌ అని ఏదో పేరు పెట్టారు. కానీ మేం మాత్రం ఆమెని ముద్దుగా పప్పీ అనే పిలుచుకునేవాళ్లం. పప్పీ సినీ పరిచయం సమయంలో ఆమెకు వాళ్ల అమ్మానాన్న  శ్రీదేవి అని పేరు పెట్టారు.


శ్రీదేవి నటించిన గోవిందా గోవిందా సినిమా షూటింగ్‌ తిరుపతిలో జరిగినప్పుడు ఆమె ఇక్కడే గెస్ట్ హౌజ్‌లో బసచేసేది. అందువల్లో ఆ సినిమా షూటింగ్‌కి మాత్రమే మేం వెళ్లాం. అంతకుమించి శ్రీదేవి నటించిన ఇంకా ఏ ఇతర సినిమా షూటింగ్‌కు తాము వెళ్లలేదు.


సినిమాల్లోకి వెళ్లిన కొత్తలో అప్పుడప్పుడు తిరుపతిలో వున్న బంధువుల ఇళ్లకు వచ్చేది. అయితే, ఆమె వచ్చిన ప్రతీసారి తమ ఇళ్ల వద్ద అభిమానుల హంగామా ఎక్కువ అవుతుండటంతో ఆ తర్వాత నుంచి క్రమక్రమంగా రావడం మానేసింది. కాకపోతే ప్రతీ సంవత్సరం ఆగస్టు13న తన పుట్టిన రోజుకు ఆమె తిరుపతికి వస్తుంటుంది. అప్పుడు మమ్మల్ని అందరిని కలిసి వెళ్లేది. తాను బస చేసిన హోటల్‌కి పిలిపించుకుని అందరితోనూ మాట్లాడేది. భద్రతా కారణాల వల్ల గెస్ట్ హౌజ్ నుంచి బయటికి వచ్చేది కాదు.


సినిమాల్లో స్టార్‌గా ఎదిగాకా శ్రీదేవి బంధువులని దూరం పెట్టింది అనే వాదనల్లో నిజం లేదు. ఆమె గురించి మాకు బాగా తెలుసు. బంధువులు ఎప్పుడు, ఎవ్వరు, తనని కలవడానికి వెళ్లినా ఎంతో కొంత సహాయం చేసేది. 


శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ కూడా మా అందరితో బాగానే మాట్లాడతారు. కాకపోతే కొంచెం భాషే సమస్య. మా అందరికీ చాలా బాగా మర్యాద ఇచ్చేవాడు. మమ్మల్ని చూడగానే నమస్కారం పెడతాడు. ఆయన మాపట్ల మర్యాదా మసులుకునే వాడు అని అనడానికి ఆయన ప్రవర్తనే చాలు కదా!


శ్రీదేవికి చికెన్, మటన్‌ చాలా ఇష్టం. నాన్‌ వెజ్‌ ఇష్టపడే తినే అమ్మాయి. మాకు తెలిసి శ్రీదేవిని వాళ్ల అమ్మ కూడా తిండి విషయంలో పెద్దగా ఏం కట్టడి చేయలేదనే అనుకోవాలి. కాకపోతే ముక్కుకు మూడుసార్లు ఆపరేషన్స్ చేయించుకున్నాక శ్రీదేవినే తిండి బాగా తగ్గించింది.


శ్రీదేవి మృతిపై మీడియాలో రకరకాల కథనాలొస్తున్నాయి కానీ అక్కడ ఏం జరిగిందనేది మాక్కూడా తెలియదు. తనకు పలానా సమస్యలు వున్నాయి అని ఆమె కూడా మా దగ్గర ఎప్పుడూ చెప్పలేదు. కాకపోతే బోనీ కపూర్‌ గారి పెద్ద భార్య కొడుకు అర్జున్‌ కపూర్‌ అప్పుడప్పుడు తన ప్రవర్తనతో కొంచెం ఇబ్బంది పెడతాడని బంధువులతో ఓసారి చెప్పుకుని బాధపడిందని మాత్రం విన్నాం. అంతకు మించి పెద్దగా మాకూ ఏమీ తెలియదు.