శ్రీదేవిపై డాక్యుమెంటరీ తీయనున్న ఆమె భర్త బోనీ కపూర్
సోషల్ మీడియాలో శ్రీదేవి మృతి మిస్టరీపై భారీ చర్చలే నడిచాయి. మీడియాలో పుంఖానుపుంఖాలుగా కథనాలు ప్రసారం అయ్యాయి.
నటి శ్రీదేవి అకాల మరణం ఆమె అభిమానులని తీవ్రంగా కలచివేసింది. శ్రీదేవి అకాల మరణం వెనుక వున్న కారణం ఏంటంటూ అనేక అనుమానాలు కలిగాయి. ఆమెది సహజ మృతి కాదని కొందరు, మృతి ఎలాంటిదైనా.. మిగతా విషయాలను చట్టానికే వదిలేద్దాం అని ఇంకొందరు వాదించారు. దీంతో సోషల్ మీడియాలో శ్రీదేవి మృతి మిస్టరీపై భారీ చర్చలే నడిచాయి. మీడియాలో పుంఖానుపుంఖాలుగా కథనాలు ప్రసారం అయ్యాయి. ఇక శ్రీదేవి వీరాభిమానిగా పేరున్న రాంగోపాల్ వర్మ ఆమె రియల్ స్టోరీ ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగానూ ఓ ప్రచారం జరిగింది. అయితే, ఈ ప్రచారంపై స్పందించిన వర్మ మాత్రం.. అటువంటిదేం లేదని కొట్టిపారేశాడు. శ్రీదేవిలా ఇంకే హీరోయిన్ నటించలేదు కనుక తాను శ్రీదేవి బయోపిక్ చేయడం లేదని స్పష్టంచేశాడు వర్మ.
ఇక శ్రీదేవి బయోపిక్ సంగతి ఇలా వుంటే, తాజాగా బాలీవుడ్ వర్గాలు చెబుతున్న కథనం ప్రకారం ఆమె భర్త బోనీ కపూర్ త్వరలోనే శ్రీదేవిపై ఓ డాక్యుమెంటరీని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. బోనీ కపూర్ సన్నిహితమిత్రుడు శేఖర్ కపూర్ ఈ డాక్యుమెంటరీని డైరెక్ట్ చేయనున్నాడట.
శేఖర్ కపూర్ అంటే ఎవరో కాదు... శ్రీదేవి బాలీవుడ్‌లోకి వెళ్లిన కొత్తలోనే ఆమెకు అత్యంత ప్రజాధరణ తెచ్చిపెట్టిన చిత్రమైన మిస్టర్ ఇండియాను డైరెక్ట్ చేసిన దర్శకుడు. శ్రీదేవి కుటుంబానికి శేఖర్ కపూర్‌తో మంచి అనుబంధం వుంది. అందుకే ఈ డాక్యుమెంటరీకి శేఖర్ కపూర్‌ని ఎంచుకున్నట్టు సమాచారం.