తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పెద్ద నిర్మాతల్లో ఒకరైన సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు ఇటీవల వ్యవసాయం చేయడం మొదలుపెట్టారట. ఈ విషయాన్ని ఈమధ్యే ఓ ఇంగ్లీష్ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా చెప్పడంతో ప్రస్తుతం పరిశ్రమలో ఇది కూడా ఓ ఆసక్తికరమైన చర్చగా మారింది. హైదరాబాద్ శివార్లలో ఉన్న ఫామ్ హౌజ్‌లో సహజ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ, అక్కడ పండించిన సహజమైన ఆహారాన్ని, పండ్లనే తీసుకుంటున్నట్టు సురేష్ బాబు వెల్లడించారు. దాదాపు ఓ 30 వరకు గోవులు కొని పెంచుతున్న సురేష్ బాబు.. ఆ ఫామ్‌హౌజ్‌కి హ్యాపీ కౌస్ అనే నామకరణం చేశారట. ఈ హ్యాపీ కౌస్‌లో పండించిన కూరగాయలు, పండ్లు, అక్కడి గోవులు ఇచ్చే స్వచ్ఛమైన పాలు మాత్రమే తీసుకుంటున్నట్టు సురేష్ బాబు ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 


ఏడాది క్రితం అనారోగ్యం బారినపడి కొంత ఇబ్బంది పడిన సురేష్ బాబు ఆ తర్వాతే ఈ వ్యవసాయం, సహజపద్ధతిలో ఆహార ధాన్యాల సాగు వంటివాటికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇక సురేష్ బాబు సినిమాల విషయానికొస్తే, ఆయన నిర్మించిన ఈ నగరానికి ఏమైంది చిత్రం ఈ నెల 29న ఆడియెన్స్ ముందుకు రానుంది.