సినీ పరిశ్రమలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, సినీ రంగానికి సేవలు అందించిన దర్శకులు, నిర్మాతలను గుర్తించి.. వారి ప్రతిభ, సేవలకుగాను సరైన రీతిలో సత్కరించే దాదా సాహెబ్ ఫాల్కే ఫౌండేష‌న్ తాజాగా 'దాదా సాహెబ్‌ ఫాల్కే ఎక్స్‌లెన్స్‌ అవార్డు'కు ఎంపికైన వారి పేర్లను ప్రకటించింది. ఇప్పటికే ప‌ద్మావ‌త్ చిత్రంలో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రతో ఆడియెన్స్‌ను, సినీ విమర్శకులను మెప్పించిన ర‌ణ్‌వీర్‌ సింగ్‌ని 'దాదా సాహెబ్‌ ఫాల్కే ఎక్స్‌లెన్స్‌ అవార్డు'కి ఎంపిక చేసినట్లు ప్రకటించిన అవార్డు కమిటీ జ్యూరీ సభ్యులు తాజాగా ఆ జాబితాలో  తమన్నా పేరును కూడా చేర్చారు. అవును, అతి చిన్న వయస్సులోనే అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంటోంది తమన్నా. బాహుబలి సినిమాలో యుద్ధానికి వెనుకడుగేయని వీర నారిగా అవంతిక పాత్రలో అద్భుతంగా నటించినందుకుగాను తమన్నాను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు జ్యూరీ సభ్యులు తెలిపారు. ఏప్రిల్ 21న ముంబైలో జరుగనున్న కార్యక్రమంలో రణ్‌వీర్ సింగ్, తమన్నాలను దాదా సాహెబ్ ఫాల్కే ఫౌండేష‌న్ ఈ అవార్డులతో సత్కరించనుంది. 


దాదా సాహెబ్ ఫాల్కే ఫౌండేషన్ తన పేరుని అవార్డుకి ఎంపిక చేయడంపై స్పందించిన తమన్నా.. ఇది తనకు లభించిన ఓ అరుదైన గౌరవంగా భావిస్తున్నట్టు స్పష్టంచేసింది. "భారతీయ సినీ పరిశ్రమకు ఎనలేని సేవలు అందించి, భారతీయ సినిమాను గొప్ప స్థాయిలో నిలబెట్టిన దాదా సాహెబ్ ఫాల్కే పేరిట ఏర్పాటైన దాదా సాహెబ్ ఫాల్కే ఫౌండేషన్ తనను ఈ అవార్డుకు ఎంపిక చేయడం ఎంతో థ్రిల్లింగ్‌‌గా వుంది" అని తమన్నా ఆనందం వ్యక్తంచేసింది.