Masooda Movie Review : మసూద రివ్యూ.. భయపెట్టిన దెయ్యం
Masooda Movie Review తిరువీర్, సంగీత ప్రధాన పాత్రలో వచ్చిన మసూద చిత్రం నేడు థియేటర్లోకి వచ్చింది. హారర్ మూవీస్ ప్రస్తుతం తెలుగు తెరపై తక్కువగా వస్తున్నాయి. మరి మసూద ఇప్పుడు తెలుగు ఆడియెన్స్‌ను ఎలా మెప్పించిందో ఓ సారి చూద్దాం.
Masooda Movie Review : మసూద సినిమా కోసం నాని, విజయ్ దేవరకొండ వంటి హీరోలు వచ్చి ప్రమోషన్స్ చేశారు. స్వధర్మ్ బ్యానర్ మీద తెలుగు వారికి మంచి అభిప్రాయం ఉంది. మళ్లీరావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వంటి సినిమాలు నిర్మించిన నిర్మాత రాహుల్ యాదవ్ నక్కాకు మంచి ఇమేజ్ ఏర్పడింది. అదే కోవలో మరోసారి హిట్ కొట్టేందుకు మసూద అంటూ ప్రేక్షకుల ముందుకు నేడు వచ్చారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? మసూద కథ ఏంటి? ఆడియెన్స్‌ను ఈ చిత్రం ఏ మేరకు మెప్పిస్తుందో చూద్దాం.
కథ
నీలం (సంగీత) తన భర్త అబ్దుల్ (సత్య ప్రకాష్)కు దూరంగా ఉంటూ తన కూతురు నాజియా(బాంధవి శ్రీదర్)ను పెంచుకుంటూ ఉంటుంది. నీలం పక్కింట్లోనే ఉండే గోపీ (తీరువీర్) కాస్త భయస్థుడు. గోపీ తన సహోద్యోగి మినీ (కావ్యా కళ్యాణ్ రామ్)ను ప్రేమిస్తుంటాడు. నీలంకు గోపీ చేదోడువాదోడుగా ఉంటాడు. అలాంటి సమయంలో నాజియా వింతగా ప్రవర్తిస్తుంటుంది. అప్పుడు ఆ కుటుంబానికి తోడుగా ఉంటాడు గోపీ. దెయ్యం పట్టి ఉంటుందన్న అనుమానంతో ఆమెను కాపాడేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈక్రమంలో గోపీకి ఎదురైన ఘటనలు ఏంటి? మినీతో ప్రేమ వ్యవహారం ఏమవుతుంది?నీలం తన కూతురిని రక్షించుకుంటుందా? నాజియాకు దెయ్యం ఎందుకు పట్టింది? అసలు మసూద ఎవరు? మసూద నేపథ్యం ఏంటి? చివరకు గోపీ ఏం చేశాడు? ఈ కథలో పీర్ బాబా (శుభలేఖ సుధాకర్), అల్లాఉద్దీన్ (సత్యం రాజేష్) పాత్రలు ఏంటి? అన్నది తెరపై చూడాల్సిందే.
నటీనటులు
మసూద కథలో గోపీ పాత్ర చాలా ఇంపార్టెంట్. ఆ పాత్రకు తగ్గట్టుగా తిరువీర్ చక్కగా నటించాడు. ఇది వరకు తిరువీర్ అంటే విలనిజం గుర్తుకు వచ్చేది. కానీ ఇందులో మాత్రం పూర్తి భిన్నంగా కనిపించాడు. నటించాడు. భయస్తుడు, మొహమాటస్తుడిగా నటించాడు. ఇక సంగీత అయితే తన సీనియారిటీని చూపించింది. ఎమోషనల్ సీన్స్‌లో కన్నీరు పెట్టించేసింది. కావ్యా కళ్యాణ్ రామ్ పాత్రకు అంతగా ఇంపార్టెన్స్ లేనట్టుగా అనిపిస్తుంది. కానీ కనిపించినంత సేపు అందంగా అనిపిస్తుంది. ఇక నాజియా పాత్రలో నటించి బాంధవి మాత్రం నిజంగానే భయపెట్టేసింది. ఈ సినిమా అంతా కూడా ఆమె చుట్టూనే నడిచింది. మసూద పాత్ర హైలెట్ అయినా ఆ కారెక్టర్లో ఎవరు నటించారన్నది సరిగ్గా చూపించలేదు. సీక్వెల్ కోసం దాచినట్టుగా అనిపిస్తుంది. మిగిలిన పాత్రల్లో సత్యం రాజేష్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్ వంటి వారు చక్కగా నటించారు.
విశ్లేషణ
మసూద కథలో ఎన్నో లేయర్స్ ఉంటాయి. ఒక చిన్న పాయింట్ పరంగా చూస్తే ఇది చాలా పాత కథే అనిపిస్తుంది. కానీ దాన్ని రాసుకున్న నేపథ్యం, తీసిన తీరు మాత్రం కొత్తగా అనిపిస్తుంది. అక్కడే డైరెక్టర్ సాయి కిరణ్ పనితనం కనిపిస్తుంది. మిగతా డిపార్ట్మెంట్ల మీద తనుకున్న గ్రిప్ కనిపిస్తుంది. కెమెరా, మ్యూజిక్ ఈ రెండింటిని సాయి కిరణ్ బాగా వాడుకున్నాడు. అసలు హారర్ సినిమాలకు విజువల్స్, సౌండ్ అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది మరోసారి మసూద నిరూపించింది.
మసూద కథ ప్రారంభంలో చాలా ఇంట్రెస్టింట్‌గా అనిపిస్తుంది. అయితే ప్రజెంట్‌లోకి వచ్చాక కథ సాదాసీదాగా అనిపిస్తుంది. అదే ఇంటర్వెల్ సమయానికి అందరిలోనూ మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. మసూద గురించి ఇంట్రడక్షన్ మాత్రం సెకండాఫ్‌లోనే ఉంటుంది. ఒక్కసారి మసూద కథ ఏంటి? అన్నది రివీల్ అయ్యాక.. ప్రేక్షకుడికి కాస్త రిలాక్స్ అయిన ఫీలింగ్ వస్తుంది. క్లైమాక్స్ కాస్త సాగదీసినట్టుగా అనిపించినా కూడా జనాలను మాత్రం భయపెట్టేశారు.
డెబ్యూ డైరెక్టర్ అయినా కూడా సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. నిర్మాత సైతం సినిమాకు ఎంత కావాలో అంతకంటే ఎక్కువే ఖర్చు పెట్టినట్టుగా అనిపిస్తుంది. మసూద సినిమా అక్కడక్కడా కాస్త స్లోగా అనిపించినా కూడా భయపెట్టడంతో మాత్రం సక్సెస్ అయింది. కెమెరా, సౌండింగ్లో మాత్రం మసూద అందరినీ సీటు అంచున కూర్చోబెట్టేస్తుంది.
రేటింగ్ : 3
బాటమ్ లైన్ : కాస్తా స్లోగా అనిపించినా భయపెట్టే 'మసూద'