Sound Party Review: క్లీన్ కామెడీతో ఫన్ ఎంటర్టైనర్.. `సౌండ్ పార్టీ` థియేటర్స్‌లో రీసౌండ్ అదుర్స్
Sound Party Movie Review: సంజయ్ శేరి దర్శకుడిగా పరిచయం అవుతూ.. వీజే సన్నీ హీరోగా రూపొందిన సినిమా సౌండ్ పార్టీ. ఈజీగా మనీ సంపాదించే ప్రయత్నల్లో తండ్రీకొడుకులు ఎలాంటి కష్టాలు పడ్డారనేది తెరపైకి చక్కగా చూపించారు. పూర్తి రివ్యూ ఇలా..
Sound Party Movie Review: బిగ్‌బాస్ విన్నర్ వీజే సన్నీ, హృతికా శ్రీనివాస్ జంటగా సంజయ్ శేరి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ సౌండ్ పార్టీ. అమాయకులైన తండ్రీకొడుకుల రిలేషన్‌షిప్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో శివన్నారాయణ, ఆలీ, సప్తగిరి, చలాకీ చంటీ, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. టీజర్, ట్రైలర్‌తో మంచి అంచనాలను క్రియేట్ చేసిన ఈ మూవీ థియేటర్స్‌లో ఏ రేంజ్ సౌండ్ చేయనుంది..? ఆడియన్స్‌ను అలరించిందా..? అనే రివ్యూలో తెలుసుకుందాం..
కథ ఏంటంటే..?
మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన కుబేర్ కుమార్ (శివన్నారాయణ), డాలర్ కుమార్(వీజే సన్నీ) తండ్రీకొడుకులు. పెద్దగా కష్టపడకుండా డబ్బు సంపాదించాలని డాలర్ కుమార్ కలలు కంటుంటాడు. తండ్రితో కలిసి రకరకాల వ్యాపారాలు చేస్తే.. నష్టాలే మిగులుతుంటాయి. నాగ భూషణం (నాగిరెడ్డి) వద్ద అప్పు తీసుకుని గోరు ముద్ద అనే హోటల్‌ను మొదలు పెడతారు. మొదట్లో వ్యాపారం బాగానే సాగినా.. డాలర్ కుమార్ ప్రేయసి సిరి (హృతిక శ్రినివాస్) తండ్రి బిజినెస్‌పై దెబ్బ కొడతాడు. దీంతో డాలర్ కుమార్ ఫ్యామిలీ పీకల్లోతు అప్పుల్లో కురుకుపోతుంది. తన డబ్బులు ఇవ్వాలని నాగ భూషణం ఒత్తిడి చేస్తాడు.
డాలర్ కుమార్, కుబేర్ కుమార్ వద్దకు ఓ డీల్ వస్తుంది. ఎమ్మెల్యే వర ప్రసాద్ (పృథ్వీ) కొడుకు చేసిన నేరం మీద జైలుకు వెళితే.. రూ.2 కోట్లు ఇస్తామని ఆఫర్ ఇస్తారు. అప్పుల్లో నుంచి బయటపడొచ్చనే ఆశతో నేరం ఏంటో తెలియకుండా తండ్రీకొడుకులు జైలుకు వెళతారు. ఆ తరువాత ఏం జరిగింది..? ఎమ్మెల్యే కొడుకు చేసిన నేరం ఏంటి..? ఉరిశిక్ష పడిన తండ్రీకొడుకులు ఎలా బయటపడ్డారు..? ఆ రూ.2 కోట్లు ఏమయ్యాయి..? కోటీశ్వరులు కావాలనే తండ్రీకొడుకుల కల నెరవేరిందా..? అనేది తెలుసుకోవాలంటే థియేటర్స్‌లో సౌండ్ పార్టీ చూడాల్సిందే.
విశ్లేషణ
ఈజీ డబ్బులు సంపాదించి కోటీశ్వరులు కావాలని ఆశపడే మధ్యతరగతి ఫ్యామిలీ కథ ఇది. ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమాలు తెలుగులో చాలానే వచ్చినా.. సౌండ్ పార్టీ మూవీలో బిట్‌కాయిన్ అనే పాయింట్‌ను తీసుకుని కామెడీని యాడ్ చేశారు. లాజిక్కులను కాసేపు పక్కనపెట్టి.. కేవలం ప్రేక్షకులను నవ్వించడమే లక్ష్యంగా డైరెక్టర్ సంజయ్ శేరి కథను రాసుకున్నాడు. తాను అనుకున్న సీన్స్‌ను అదేస్థాయిలో తెరపై చూపించి సక్సెస్ అయ్యాడు. ప్రతీ సీన్ నవ్వించే విధంగానే తీశాడు.
కుబేర్ కుమార్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ను పరిచయం చేస్తూ.. కథ మొదలవుతుంది. మొదటి సీన్‌తోనే సినిమా ఎలా ఉంటుందో దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. డబ్బు సంపాదించేందుకు తండ్రీకొడుకులు చేసే పనులు ప్రేక్షకులను బాగా నవ్విస్తాయి. అయితే హీరోయిన్‌తో వచ్చే సీన్స్ పెద్దగా యాప్ట్‌గా అనిపించవు. ఫస్ట్ హాఫ్‌లో అక్కడక్కడ కొన్ని సీన్లు రొటీన్‌గా ఉన్నా.. హాయిగా నవ్వుకునే విధంగా తీశాడు. ఇక సెకాండఫ్‌లో కామెడీ బాగా పండింది. జైలు నుంచి తప్పించుకునేందుకు తండ్రీకొడుకులు చేసే పనులు బాగా నవ్వు తెప్పిస్తాయి. RRR మూవీలో ఓ సీన్ స్పూఫ్ ఈ సినిమాకు ప్లస్ అవుతుంది. బిట్ కాయిన్ ఎపిసోడ్ స్టోరీని మరో మలుపు తిప్పుతుంది. లాజిక్కుల గురించి ఆలోచించకుండా.. సౌండ్ పార్టీకి వెళితే బాగా ఎంటర్‌టైన్ అవుతారు.
ఎవరు ఎలా నటించారంటే..?
డాలర్ కుమార్ పాత్రలో సన్నీ.. కుబేర్ కుమార్ పాత్రలో శివన్నారాయణ అదరగొట్టారు. తండ్రీకొడుకుల కెమెస్ట్రీ సూపర్‌గా సెట్ అయింది. ఈ మూవీకి వీరిద్దరే ప్రధాన బలం. సిరి పాత్రలో హృతిక శ్రీనివాస్ తెరపై అందంగా కనిపించింది. పృథ్వీ, సప్తగిరి, మాణిక్ రెడ్డి, చలాకీ చంటి తదితరులు ప్రేక్షకులను నవ్వించారు. సైంటిస్ట్‌గా అలీ ఒకటి రెండు సీన్లలో తెరపై కనిపించినా.. బాగానే నవ్వించాడు. ప్రియ, నాగిరెడ్డితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర యాక్ట్ చేశారు.
మోహిత్ రెహమానిక్ మ్యూజిక్ బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తోపాటు సాంగ్స్ కూడా బాగున్నాయి. ప్రతీ ఫ్రేమ్ రిచ్‌గా ఉండేలా శ్రీనివాస్ రెడ్డి సినిమాటోగ్రఫీ మెప్పిస్తుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి ఉన్నతంగా ఉన్నాయి. అవినాష్ ఎడిటింగ్ పనితీరు బాగుంది. అయితే ఫస్టాఫ్‌లో కాస్త కత్తెరకు పని చెప్పాల్సింది. ప్రొడ్యూసర్‌గా తొలి సినిమాతోనే విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు రవి పొలిశెట్టి. నిర్మాత, డైరెక్టర్ తొలి ప్రయత్నం సక్సెస్ అయింది. 2 గంటలపాటు హాయిగా నవ్వుకుని.. ఎంజాయ్ చేసేందుకు సౌండ్ పార్టీ మూవీకి వెళ్లొచ్చు.
రేటింగ్: 2.75