కేవలం 40 ఏళ్ల వయసులోనే.. 44 మంది పిల్లలకు తల్లి అయ్యింది..!
ఆమె వయసు కేవలం 40 సంవత్సరాలు. కానీ ఆమె సంతానం ఆమె వయసు కంటే ఎక్కువ. మరియమ్ నబాటాంజీ అనే ఆమె ఉగాండా వాస్తవ్యురాలు.
ఆమె వయసు కేవలం 40 సంవత్సరాలు. కానీ ఆమె సంతానం ఆమె వయసు కంటే ఎక్కువ. మరియమ్ నబాటాంజీ అనే ఆమె ఉగాండా వాస్తవ్యురాలు. అక్కడి ముకనో జిల్లాలో ఉండే ఆమెకు 12 సంవత్సరాలకు పెళ్లవ్వగా.. గత 20 సంవత్సరాలుగా.. ప్రతీ యేటా కనీసం ఇద్దరు బిడ్డలకు జన్మనివ్వడంతో.. ఇప్పుడు ఆ సంఖ్యను 44 మందికి పెరిగింది. దీంతో ఆమె ఆ దేశంలో ఓ సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఆమె తన సంతానంలో ఆరు సార్లు కవలలకి జన్మనివ్వగా .. నాలుగుసార్లు ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. మరో మూడుసార్లైతే నలుగురు బిడ్డలకు కూడా జన్మనిచ్చింది. అయితే ఆమె కన్న 44 మంది బిడ్డల్లో కేవలం 38 మంది మాత్రమే బతికున్నారు. అయితే ఆమె ఇంత పెద్ద కుటుంబం కలిగి ఉండడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఆమె మాట్లాడుతూ "నాకు 12 సంవత్సరాల వయసులోనే పెళ్లయింది. అప్పటికే నా భర్త వయసు 28 సంవత్సరాలు. చిన్నప్పుడు కూడా చాలా పేదరికం అనుభవించాను. మాకు తిండి లేని సమయంలో మా సవతి తల్లి నా నలుగురు చెల్లెళ్ళకు అన్నంలో గాజుముక్కలు కలిపి తినిపించి చంపేసింది. కానీ నేను మాత్రం ఆ గండం నుండి బయటపడ్డాను. ఆ తర్వాత నన్ను బలవంతంగా ఓ వ్యక్తికి కట్టబెట్టారు. ఆయన నన్ను సెక్స్ బానిసగా మార్చేశాడు" అని తెలిపింది.
తను 18 మంది పిల్లలను కన్నాక.. ఆపరేషన్ చేయించుకోవాలని భావించానని.. కానీ విపత్కర పరిస్థితుల వల్ల కుదరలేదని తెలిపింది. అయితే డాక్టర్లు మరియమ్ గురించి మాట్లాడుతూ.. ఒక జన్యు పరమైన సమస్య వల్లే ఆమె ఒకే కాన్పులో ఇద్దరు కంటే ఎక్కువమంది పిల్లలను కనడం జరుగుతోందని తెలిపారు. 2016లో చివరిసారిగా ఆమెకు ఆపరేషన్ చేయడంతో ఆమె మళ్లీ తల్లి అయ్యే అవకాశం కలగలేదు.