ఫిల్మ్ ఛాంబర్‌కి వచ్చి అర్థనగ్న ప్రదర్శన చేసి సినీ పరిశ్రమ పరువును బజారుకీడ్చిన నటి శ్రీరెడ్డికి "మా" అసోసియేషన్ సభ్యత్వం ఇచ్చేదిలేదని ఆ సంస్థ అధ్యక్షుడు శివాజీరాజా తెలిపారు. ఈ అసోసియేషనులో ఉన్న ఏ సభ్యుడు, సభ్యురాలు కూడా శ్రీరెడ్డితో కలిసి నటించకూడదని తాము తీర్మానించినట్లు ఆయన పేర్కొన్నారు. శ్రీరెడ్డికి మొదట్లో సభ్యత్వం అడిగితే దరఖాస్తు ఫారం ఇచ్చామని.. కానీ ఆమె కనీసం డీడీ కూడా చెల్లించలేదని.. ఉచిత సభ్యత్వం కావాలని డిమాండ్ చేసిందని అసోసియేషన్ సభ్యులు నటి హేమ తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ తర్వాత వివిధ టీవీ ఛానల్స్‌లో ఇంటర్వ్యూలు ఇవ్వడంతో పాటు.. ఫిలిం ఛాంబర్ ఎదుటే అసభ్యంగా ప్రవర్తించిందని తెలిపారు. ఈ క్రమంలో "మా" అసోసియేషన్ మొత్తం కలిసి శ్రీరెడ్డిని పరిశ్రమ నుండి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించినట్లు సభ్యులు తెలిపారు. ఇతర నటీనటులెవరైనా కూడా ఇలాంటి క్రమశిక్షణ ఉల్లంఘన చర్యలకు పాల్పడితే.. వారిని శ్రీరెడ్డిలాగే బహిష్కరిస్తామని తీర్మానించారు. 


ఈ సందర్భంగా ఈ సమావేశానికి హాజరైన సినీనటుడు శ్రీకాంత్ మాట్లాడుతూ, దయచేసి ఎవరూ శ్రీరెడ్డి లాంటివారిని ఎంకరేజ్ చేయవద్దని తెలిపారు. సమస్య ఉంటే ఆయా నటీనటులు మా సభ్యులైనా, కాకపోయినా ఫిర్యాదు చేస్తే విచారించి చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. అంతేగానీ, మీడియాకి వెళ్లి రచ్చ చేస్తే ఊరుకొనేది లేదని.. ఇలాంటి వాటిని ఆక్షేపించేది లేదని తెలిపారు. ఈ సమావేశంలో మా సభ్యులు నరేశ్, బెనర్జీ, ఉత్తేజ్ మొదలైన వారు పాల్గొన్నారు