లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీలక నిర్ణయం
ఇండియన్ ఐడల్ సింగింగ్ రియాలిటీ షోలో జడ్జీల్లో ఒకరిగా వ్యవహరిస్తున్న బాలీవుడ్ సీనియర్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అను మాలిక్ ఆ ప్యానెల్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ప్రస్తుతానికి తాను పనిమీద దృష్టిసారించలేకపోతున్నందునే తాత్కాలికంగా తాను ఆ షో నుంచి తప్పుకుంటున్నట్టు అనుమాలిక్ స్పష్టంచేశాడు. 2004 నుంచి అను మాలిక్ ఈ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్నాడు. అనుమాలిక్ సైతం లైంగిక వేధింపులకు పాల్పడిన వారిలో ఒకరు అని ఇండియన్ ఐడల్ 5ను సమర్పిస్తున్న సంస్థలో పనిచేసే ఓ యువతి అతనిపై ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఔత్సాహిక నేపథ్య గాయనిలుగా పేరు తెచ్చుకుంటున్న సోనా మహపాత్ర, శ్వేతా పండిత్ వంటి వాళ్లు అనుమాలిక్ పై ఈ ఆరోపణలు గుప్పించారు.
ఇటీవల కాలంలో మీటూ పేరిట జరుగుతున్న ఉద్యమంలో పాల్గొంటున్న సినీ రంగంలోని పలువురు యువతులు, మహిళలు పలువురు సినీ ప్రముఖులు తమను వేధించిన వైనాన్ని గుర్తుచేసుకుంటున్న తీరు సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలోనే అను మాలిక్ పేరు లైంగిక వేధింపుల ఆరోపణలతో వెలుగులోకొచ్చింది.