ఆయన మరణించి దశాబ్దాలు కావస్తున్నా ..ఆయన గానామృతం మాత్రం ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉంది. భక్తి గీతాలు, యుగళ గీతాలు, విషాద గీతాలు .. ఇలా అన్ని రకాల పాటలను ఆయన తన స్వరంలో అద్భుతంగా పలికించారు. ఇంతకీ ఆయన ఎవరో గుర్తుపట్టారా ? అదేనండి... స్వర మాంత్రికుడు మన ఘంటసాల వెంకటేశ్వరరావు. సంగీత ప్రపంచాన్ని ఊలలాడించిన ఆయన పాత్ర ఇప్పుడు తెర మీద కూడా కనిపిస్తోంది.. ఆయన చరిత్ర బయోపిక్ రూపంలో  తెరపై దర్శనమీయనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆయన జీవితమే సినిమా !


ప్రతీ విజేత వెనుక కఠోర కష్టాలున్నట్లే ఘంటసాల జీవితంలో కూడా కష్టనష్టాలు ఎన్నో ఉన్నాయి.  కెరియర్ ఆరంభంలో ఘంటసాల ఎన్నో కష్టాలు పడ్డారు. విజయనగరంలో సంగీత సాధన చేసే రోజుల్లో జోలె పట్టి ఇంటింటికీ తిరిగి ఆహారాన్ని తెచ్చుకోవడం చేశారట. పొట్టకూటి కోసం ఘంటసాల పడిన ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. ఈ స్థితి నుంచి సంగీత రంగంలో రారాజుగా వెలిగిన అతని జీవిత చరిత్రను  తెరకెక్కించడానికి సన్నాహాలు మొదలయ్యాయి. 


నటీ నటులు వీరే..


ఘంటసాల జీవితచరిత్రపై పరిశోధన చేసిన ప్రొ'' సీహెచ్ రామారావు ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది. ఘంటసాల పాత్రను సింగర్ కృష్ణ చైతన్య పోషించనున్నాడని టాక్. అతని భార్య మృదుల ఘంటసాల సతీమణిగా కనిపించనుంది. లక్ష్మీ నీరజ నిర్మించనున్న ఈ చిత్రానికి సాలూరి రాజేశ్వరరావు కుమారుడు వాసురావు సంగీతం అందించనున్నారు.