ఒకప్పటి మల్టీస్టారర్ సినిమాలంటే ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు లాంటి హీరోలవే..! వారు కలిసి ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. అక్కినేని-ఎన్టీఆర్ కలిసి పదికిపైగానే సినిమాలు చేశారంటే అతిశయోక్తికాదేమో..! వారి తరువాతి తరం అగ్రహీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వీరితో ఒక కాంబినేషన్‌లోనైనా మల్టిస్టారర్ సినిమా వస్తుందేమోనని అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు కానీ.. వారి కోరిక తీరలేదు. కాగా.. ఇప్పుడు కుడా ఆ తరం హీరోలు ఈతరం యువ హీరోలతో పోటిపడి మరీ నటిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే..ఆ తరం హీరోలు కలిసి మల్టిస్టారర్ చేయకపోవడానికి కారణం అభిమానులేనట. పలు ఇంటర్వ్యూలో వారు ఈ విషయాన్ని బహిర్గతం చేశారు. వారు అలా మల్టీ  స్టారర్ చిత్రాలు చేయకపోవడానికి కారణం అభిమానులు, వారి సంఘాలే కారణం అని సన్నిహితుల వద్ద చెప్పారని టాక్. మల్టీ స్టారర్స్ చేస్తే.. ఎక్కడ అభిమానుల మధ్య మనస్పర్థలు పెరుగుతాయోనన్న భయంతో కథానాయకులు అలాంటి చిత్రాలు చేయడానికి మొగ్గు చూపించలేదని తెలుస్తోంది. ఇప్పుడు కాలం మారింది. అభిమానులు కూడా కథను బట్టి పాత్ర ఉంటుందని.. కథను బట్టే హీరోలు ఆ పాత్రల్లో నటిస్తున్నారని తెలుసుకున్నారు. అలాగే ఇప్పుడు అభిమానులు కుడా మల్టిస్టారర్ చిత్రాలను కోరుకొంటున్నారు.


'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంతో వెంకటేష్, మహేష్ బాబు మల్టిస్టారర్ చిత్రాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఆ తరువాత గోపాల గోపాల, ఊపిరి, బాహుబలి లాంటి అనేక చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు టాలీవుడ్‌లో ప్రతి స్టార్ హీరో కూడా మల్టిస్టారర్ సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నారు.ప్రస్తుతం నాగార్జున, నాని కలయికలో ఒకటి.. వెంకటేష్, నారారోహిత్ కలిసి ఒకటి.. ఇలా కొన్ని మల్టిస్టారర్ చిత్రాలు మనల్ని త్వరలో అలరించబోతున్నాయి.


రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న ఎన్టీఆర్, రాంచరణ్ మల్టిస్టారర్ చిత్రం టాలీవుడ్‌ లో అగ్ర హీరోల మల్టిస్టారర్ చిత్రాలు రావడానికి పెద్ద పునాది కాబోతుంది. ఈ ప్రేరణతో మరికొంత మంది దర్శకులు కూడా ముందుకు రావచ్చు. అ..! చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ మధ్యనే ఒక ఇంటర్వూలో చిరంజీవి, బాలకృష్ణలతో కలిసి మల్టిస్టారర్ సినిమా చేయాలని ఉంది అని చెప్పారు. ఏమో...అలాంటి చిత్రం రావొచ్చేమో..! ఇప్పుడు కావాల్సింది అందుకు తగ్గ కథ రెడీ చేసుకోవడమే!