కాలనీలోకి చొరబడిన చిరుత; ముగ్గురికి గాయాలు
శుక్రవారం చిరుత నివాస ప్రాంతంలోకి ప్రవేశించి, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది.
ఇండోర్: మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో గల పల్హర్ నగర్‌లో చిరుత శుక్రవారం నివాస ప్రాంతంలోకి ప్రవేశించి, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఆహారం, నీళ్ల కోసం అన్వేషిస్తూ అడవి నుంచి నివాస ప్రాంతంలోకి చొరబడిన చిరుతను అపస్మారక స్థితిలో పట్టుకున్నారు. దాదాపు రెండు గంటలపాటు ఆ చిరుతను పట్టుకొనేందుకు శ్రమించారు. కాగా చిరుతపులి దాడిలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన సంబంధించిన వీడియోలో చిరుతపులిని పట్టుకోడానికి స్థానికులు ప్రయత్నిస్తున్నట్లు చూడవచ్చు.
స్థానిక కమలా నెహ్రూ జూ పార్క్ ఇంచార్జ్ ఉత్తమ్ యాదవ్ ఈ ఆపరేషన్ తర్వాత మీడియాతో మాట్లాడుతూ, 'ఎనిమిది ఏళ్ల చిరుత నగరం సమీపంలోని అటవీ ప్రాంతం నుండి వచ్చింది. మొదట ఇది పల్హర్ నగర్‌ని ఇంటి వరండాలోకి ప్రవేశించింది. ఆతరువాత ఒక చోటు నుండి మరో చోటుకి పరుగెత్తింది. చిరుత దాడి ఘటనలో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరు అటవీ సిబ్బంది ఉన్నారు' అని అన్నారు. చివరగా అటవీ బృందం శ్రిమించి ఆ చిరుతను పట్టుకొని ఇండోర్‌లోని జూ పార్కుకు తరలించారు.