మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు నటుడు రామ్ చరణ్. చిరంజీవి కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రమిది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. రెండురోజుల క్రితం హాలీవుడ్ సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో అత్యంత కీలకమైన పోరాట సన్నివేశాలను చిత్రీకరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇలా సినిమా యూనిట్ ఎంతో కష్టపడి షూట్ చేస్తుంటే.. కొందరు షూటింగ్ స్పాట్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి బ్రిటిష్ సైన్యం గెటప్‌లో యుద్ధానికి రెడీగా ఉన్న ఆర్టిస్టుల ఫోటోలు, ఓ భారీ కోట తగలబడుతున్న ఫోటోలు, పలు సన్నివేశాలు లీక్ అయ్యాయి. దీంతో సైరాకు లీక్‌ల సమస్య వచ్చిపడింది. దీనివలన నష్టం వాటిల్లే అవకాశం ఉంది కనుక ఇకపై మరింత జాగ్రత్తగా షూటింగ్ సన్నివేశాలను చిత్రీకరించాలని, సీన్లు లీక్ కాకుండా చూడాలని అభిమానులు కోరుతున్నారు.


సైరా నరసింహారెడ్డి చిరంజీవి 151వ చిత్రం. ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, రేనాటి సూర్యుడుగా కొలవబడే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, నయనతార, విజయ్ సేతుపతి ఈ చిత్రంలో ముఖ్య తారాగణం.