ప్రముఖ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ దిగ్గజం యాపిల్ సంస్థకు మరో ప్రముఖ సాంకేతిక దిగ్గజమైన గూగుల్ సంస్థ ఏకంగా 9 బిలియన్ డాలర్లు ( భారతీయ కరెన్సీలో సుమారు రూ.65వేల కోట్లు) చెల్లించనుంది. యాపిల్ తయారు చేసే ఐఫోన్లలో గూగుల్‌ను డీఫాల్ట్ సెర్చ్ ఇంజిన్‌గా కొనసాగించేందుకుగాను గూగుల్ యాపిల్ కంపెనీకి ఈ మొత్తాన్ని చెల్లించనుంది. గూగుల్-యాపిల్ సంస్థల మధ్య జరిగిన ఓ అవగాహన ఒప్పందం మేరకు 2013 నుంచి గూగుల్ ప్రతీయేటా ఈ మొత్తాన్ని చెల్లిస్తూ వస్తోంది. మొదటి ఏడాది అప్పటి ఒప్పందం ప్రకారం యాపిల్‌కు బిలియన్ డాలర్లు చెల్లించిన గూగుల్.. 2017లో 3 బిలియన్ డాలర్లను చెల్లించాల్సి వచ్చింది. ప్రస్తుతం పెరిగిపోయిన సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, యాపిల్ ఫోన్ల వినియోగదారుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ఈసారి యాపిల్ ఏకంగా 9 బిలియన్ డాలర్లు వసూలు చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.


ఇదిలావుంటే, మరోవైపు గూగుల్ సైతం తమకు వచ్చే ఆన్‌లైన్ ట్రాఫిక్‌లో అధిక వాటా యాపిల్ ఫోన్ల వినియోగదారుల నుంచే అని బలంగా విశ్వసిస్తోంది. అందుకే యాపిల్ అడిగిన మొత్తాన్ని చెల్లించేందుకు వెనుకాడటం లేదని సమాచారం.