ఇటీవలే "మహానటి" చిత్రం ద్వారా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న నటి కీర్తి సురేష్ మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో నటిస్తుందనే వార్తలు వస్తున్నాయి. బాహుబలి 2 చిత్రం తర్వాత లెజెండరీ దర్శకులలో ఒకరిగా గొప్ప డైరెక్టర్స్ జాబితాలో పేరు సంపాదించిన ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో కీర్తి నటించే అవకాశాలు ఉన్నాయని ఫిలిం నగర్‌లో పలు వార్తలు హల్చల్ చేస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ ప్రాజెక్ట్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న "ఆర్ ఆర్ ఆర్" చిత్రమే అయ్యే అవకాశం ఉందని కూడా ఊహాగానాలు ఇండస్ట్రీలో కోడై కూస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం నిర్మాతలు కీర్తితో మాట్లాడినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఆమె ఈ  ప్రాజెక్టుకి ఒప్పుకుందో లేదో మాత్రం తెలియదు. ప్రస్తుతం కీర్తి సురేష్ తమిళంలో విక్రమ్ సరసన "సామి 2" చిత్రంలో నటిస్తోంది. 


2000లో పైలెట్స్ అనే మలయాళం చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయమైన కీర్తి సురేష్, ఇదు ఎన్న మాయం అనే తమిళ చిత్రంతో హీరోయిన్‌గా చిత్ర పరిశ్రమలోకి ఎంటరైంది. ఆ తర్వాత నేను శైలజ, నేను లోకల్, అజ్ఞాతవాసి వంటి తెలుగు చిత్రాలలో కూడా నటించింది. ఆ తర్వాత అలనాటి నటి సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన "మహానటి" చిత్రంలో కూడా తనదైన మార్కు నటనను కనబరిచి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.


ఆ ఒక్క సినిమాతో కీర్తి స్టార్ హీరోయిన్ల సరసన చేరిపోయినట్లు ఇప్పటికే చాలామంది సినీ పత్రికలలో వార్తలు కూడా రాసేయడం విశేషం. ఈ క్రమంలో ఆమె రాజమౌళి దర్శకత్వం వహించే సినిమాలో నటించినా ఆశ్చర్యపోనవసరం లేదని పలువురు అంటున్నారు.