LSD Web Series Review and Rating: ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. సరికొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. శివ కోన, అభిలాష్ బండారి, కునాల్ కౌశల్, రమ్య దినేష్, నేహా దేశ్ పాండే, ప్రాచీ కెథర్, ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ LSD. ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్స్‌పై అనిల్ మోదుగ, శివ కోన నిర్మించగా.. శివ కోన దర్శకత్వం వహించారు. ప్రవీణ్ మణి సంగీతం అందించగా.. ఎడిటర్‌గా బసవా, సినిమాటోగ్రాఫర్‌గా పవన్ గుంటుకు పనిచేశారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఎమ్ఎక్స్ ప్లేయర్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్‌ ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా రివ్యూలో చూద్దాం.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కథ ఏంటంటే..?


కొంతమంది ఫ్రెండ్స్ అందరూ కలిసి ఫారెస్ట్‌కు ట్రిప్‌కు వెళతారు. వీరిలో రెండు జంటలు ఇప్పటికే పెళ్లి చేసుకున్న వారు ఉండగా.. ఒక జంట త్వరలోనే పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉంటారు. వీళ్లు ట్రిప్‌కు బయలుదేరే ముందే ఓ పాప వింతగా కనిపిస్తుంటుంది. ఆ పాపకు ఓ కల వస్తుంది. అడవికి వెళ్లడం బాగోదని.. అక్కడ మీకు ప్రాణాపాయం పొంచి ఉందని ఆ పాప హెచ్చరించినా.. వాళ్లు పట్టించుకోకుండా ట్రిప్‌కు వెళ్లిపోతారు. కొంతదూరం ప్రయాణం సాఫీగానే సాగుతుంది. ఆ తర్వతే ఊహించని మలుపులు తిరుగుతుంది. మూడు జంటల్లో ఒక్కొక్కరు మరణిస్తుంటారు. ఇద్దరు చనిపోగా.. నలుగురు మిగులుతారు. ఆ అడవిలో ఏ ఉంది..? హత్యల వెనుక ఉన్న నిజం ఏంటి..? ఆ తరువాత ఏ జరిగింది..? అనేది తెలియాలంటే LSD వెబ్ సిరీస్‌ చూడాల్సిందే.


విశ్లేషణ


ఓ పాప వింతగా ప్రవర్తించడం.. ఓ కోడిని కోసుకొని పలావ్ చేసుకొని తినడంతో ఫస్ట్ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్‌గా మొదలవుతుంది. తరువాత ఏం జరుగుతుందానే క్యూరియాసిటిని పెంచుకుంటు వెళ్లాడు డైరెక్టర్ శివ కోన. స్నేహితులు అంతా కలిసి ట్రిప్‌కు వెళ్తుంటే పాప ఎందుకు వెళ్లొద్దని చెప్పిందనే ఇంటెన్స్‌తో ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతుంది. అడవికి వెళ్లిన ఆరుగురిలో ఒక్కొక్కరిది ఒక్కొ పంథా ఉంటుంది. అడవిలో ఒక్కొక్కరు మరణించడం.. మిగిలిన వారిలో భయం కలుగుతుండటంతో స్టోరీపై మరింత థ్రిల్ కలుగుతుంది.


అయితే అక్కడక్కడ కొన్ని అడల్డ్ సీన్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువగా ఉండటంతో ఫ్యామిలీతో కలిసి చూసేందుకు ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ వెబ్ సిరీస్‌లో నటీనటుల యాక్టింగ్ చక్కగా ఉంటుంది. స్క్రీన్ ప్లే  గ్రిప్పింగ్‌గా ఉంది. ఎక్కడా సీన్లు బోరు కొట్టకుండా శివ కోన చక్కగా తెరకెక్కించాడు. ఫస్ట్ ఎపిసోడ్ పాత్ర పరిచయంతో కొంత స్లోగా సాగినా.. రెండు, మూడు ఎపిసోడ్స్ నుంచి వేగం పెరుగుతుంది. చివరి ఎపిసోడ్‌లో ఊహించని ట్విస్ట్‌లతో కథపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తాయి. క్లైమాక్స్‌లో ఊహించన ట్విస్టులకు ఫిదా అవ్వడం ఖాయం. ఫ్యామిలీతో కాకుండా థ్రిల్లర్ సిరీస్‌లు చూసే వారికి ఈ వెబ్ సిరీస్‌ తప్పకుండా నచ్చుతుంది. పవన్ గుంటుకు సినిమాటోగ్రఫీ చక్కగా ఉంది. ప్రవీణ్ మణి మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది‌. ఎడిటర్ బసవా కత్తెరకు కాస్త పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు స్థాయికి తగ్గట్లు ఉన్నాయి. 


ఎవరు ఎలా నటించారంటే..?


క్యాండీ క్యారెక్టర్‌లో ప్రాచీ థాకెర్ చక్కగా నటించింది. రాజు గారి పాత్రలో ప్రభాకర్ ఆకట్టుకున్నాడు. దర్శకుడు శివ కోన డ్యాని అనే కీలక పాత్రలో మెప్పించాడు. యాక్టర్‌గా మంచి మార్కులే కొట్టేశాడు. అభిలాష్ బండారి, కునాల్ కౌశల్, రమ్య దినేష్, నేహా దేశ్ పాండే తదితరులు తమ పాత్రల పరిధి యాక్టింగ్‌తో మెప్పించారు. అక్కడక్కడ కొన్ని సీన్స్‌లో పాత్రల డబ్బింగ్ కృత్రిమంగా అనిపిస్తుంది. ఈ విషయంపై మేకర్స్ మరింత దృష్టిపెట్టాల్సింది. 


చివరగా.. అక్రమ సంబంధాలు హానికరం అనే మెసెజ్‌ను చూపిస్తూ.. థ్రిల్లింగ్ ట్విస్ట్‌లతో తీసిన 'LSD' వెబ్‌సిరీస్‌ను ఓ సారి చూడొచ్చు.  


రేటింగ్: 2.5