ఈ రోజు సోషల్ మీడియాలో ట్రాలింగ్ పేరుతో ఏ అంశం మీద పెడితే.. ఆ అంశం మీద పిచ్చివాగుడు వాగడం కొందరికి కామన్ అయిపోయింది. అయితే ఇదే వాగుడు హద్దులు దాటితే మాత్రం అంతే సంగతులు. కెరీర్ నాశనం అవ్వడంతో పాటు ఉద్యోగాల నుండి తొలిగించే అవకాశం ఉంది. ఇటీవలే కేరళ రాష్ట్రం వరదల కారణంగా ఎంతగా అతలాకుతలం అయ్యిందో తెలియని విషయం కాదు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో నెటిజన్లు సహాయం కోసం అనేక పోస్టులు పెట్టారు. ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు ఇవ్వమని కూడా కోరారు. అలాగే నిర్వాసితులకు ఆహారం, మందులు, నిత్యవసర వస్తువులు, బట్టలు సరఫరా చేయమని కూడా పలువురు కోరారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో మహిళలకు  ‘శానిటరీ నాప్‌కీన్లు’ కూడా సరఫరా చేయమని పలు గ్రూపుల్లో కొందరు పోస్టులు పెట్టారు. అది మంచి ఉద్దేశమయినా.. ట్రాలింగ్ చేయడమే పనిగా పెట్టుకున్న ఓ వ్యక్తి మాత్రం "ఏం.. కండోమ్‌లు మాత్రం సరఫరా చేయరా" అని ఓ అసభ్యకరమైన పోస్టు పెట్టాడు. ఆ పోస్టు పెట్టిన వ్యక్తి లూలూ కంపెనీ ఉద్యోగి కావడంతో.. ఆ సంస్థ వారు తమ ఉద్యోగి చేసిన కామెంట్లను తీవ్రంగా పరిగణించారు. ఇలాంటి అసభ్యమైన కామెంట్లు చేసే ఉద్యోగులు తమకు అవసరం లేదని.. ఆయనను ఉద్యోగం నుండి తొలిగిస్తున్నామని సంస్థ తెలిపింది. 


అయితే అనుకోని ఆ చర్యకి ఆ సదరు ఉద్యోగి ఫేస్‌బుక్‌ ద్వారా క్షమాపణలు కోరారు. మద్యం మత్తులో తాను ఏం కామెంట్ చేశాడో తనకే తెలియలేదని.. తనను క్షమించమని తెలిపాడు. అయితే తమ సంస్థకు నైతిక విలువలు ముఖ్యమని.. తమ ఉద్యోగులకు కూడా మంచి విలువలు ఉండాలని తాము కోరుకుంటామని.. అందుకే సదరు ఉద్యోగిని జాబ్ నుండి తొలిగిస్తున్నామని లూలూ కంపెనీకి చెందిన మానవ వనరుల విభాగం స్పష్టం చేసింది. ఈ చర్య మిగతా ఉద్యోగులకు కూడా పాఠం కావాలని.. సమాజంలో కూడా తమ ఉద్యోగులు హుందాగా వ్యవహరించాలని తాము కోరుకుంటామని లూలూ సంస్థ తెలియజేసింది.