తెలుగు సినీ పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ. స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామా రావుకి తనయుడిగా టాలీవుడ్‌కి పరిచయమైనప్పటికీ.. ఆ తర్వాత తనదైన స్టైల్ నటన, డైలాగ్ డెలివరితో భారీ సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్న నటుడు బాలకృష్ణ. ముఖ్యంగా ఫ్యాక్షనిజం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాలు ఆయన్ని అభిమానులకు మరింత చేరువ చేశాయి. ఆ తర్వాత బాలకృష్ణ కాస్తా బాలయ్య బాబుగా అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. 2014 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన బాలయ్య బాబు.. అనంతపురం జిల్లా హిందూపురం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగానూ ఎన్నికయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఇదంతా ఇలా వుంటే, తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన నాగబాబును ఇంటర్వ్యూయర్ బాలయ్య బాబు గురించి ఆయన అభిప్రాయం చెప్పమని అడిగారు. ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్నకు నాగబాబు స్పందిస్తూ.. బాలయ్య ఎవరో తనకు తెలియదని అన్నారు. కొన్ని క్షణాల అనంతరం మళ్లీ సర్దుకున్నట్టు చేసిన నాగబాబు.. అయ్యో బాలయ్య ఎవరో తెలియని అన్నానా.. ఆయన ఎందుకు తెలియదు.. బాలయ్య చాలా పెద్ద ఆర్టిస్టు అని చెబుతూ.. అప్పట్లోనే కృష్ణ గారితో కలిసి బాలయ్య నేరం-శిక్ష వంటి సినిమాల్లో నటించారు అని అన్నారు.


అయితే, నాగబాబు సమాధానాన్ని మధ్యలోనే అడ్డుకున్న ఇంటర్వ్యూయర్.. ఇక్కడ తాను అడుగుతోంది ఆ బాలయ్య గురించి కాదని, ఈ తరం నటుడు, అభిమానులు ముద్దుగా బాలయ్య బాబు అని పిలుచుకునే బాలకృష్ణ గారి గురించి అని అన్నారు. ఇంటర్వ్యూయర్ ప్రశ్నను పూర్తిగా విన్న నాగబాబు.. అయితే, ఆ బాలకృష్ణ ఎవరో తనకు తెలియదని ఖరాఖండిగా తేల్చిచెప్పేశారు. 


నాగబాబు సమాధానంతో సరిపెట్టుకోని ఇంటర్వ్యూయర్.. సినిమా వాళ్లంతా ఒకే కుటుంబంలా ఉంటుంటారని, అయితే, కేవలం రాజకీయ విభేదాల వల్లే మీరు(నాగబాబు) అలా సమాధానం ఇస్తున్నారని అని భావించవచ్చా అని మరోసారి అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. తనకు నిజంగానే ఆయన ఎవరో తెలియదని నిర్మోహమాటంగానే సమాధానం ఇచ్చారు. నాగబాబు చెప్పిన ఈ సమాధానం చూస్తోంటే, ప్రస్తుతం జనసేన పార్టీ అధినేతగా వున్న తన సోదరుడు పవన్ కల్యాణ్‌పై టీడీపీ చేస్తోన్న విమర్శలను దృష్టిలో పెట్టుకునే ఆయన ఇలా సమాధానం ఇచ్చి ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.