విద్యాబాలన్‌కు బాలయ్య ఘనస్వాగతం
ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో నటసార్వభౌముని సతీమణి బసవతారకం పాత్రలో విద్యా బాలన్ నటిస్తున్నారు.
ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో నటసార్వభౌముని సతీమణి బసవతారకం పాత్రలో విద్యా బాలన్ నటిస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు ఆమె తొలి రోజు షూటింగ్‌కు హాజరయ్యారు. అయితే ఆమెను స్వయాన బాలయ్యే స్వయంగా తన కారులో షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి తీసుకురావడం విశేషం. అంతకు ముందే విద్యా బాలన్ బాలయ్య బాబు ఇంటికి వెళ్లారు. బాలయ్య సతీమణి వసుంధర విద్యా బాలన్‌ను సాదరంగా ఇంటిలోకి ఆహ్వానించి.. ఎన్టీఆర్ కుమార్తె లోకేశ్వరి చేతుల మీదుగా పట్టుచీరను అందించారు.
క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం తొలి రోజు షూటింగ్‌లో బాలయ్య, విద్యా బాలన్ పై పలు షాట్లు తీశారు. రామోజీ ఫిల్మ్ సిటీ ఈ షూటింగ్‌కు ప్రధాన కేంద్రంగా మారింది. ఈ చిత్రంలో నందమూరి బసవతారకం పాత్రలో నటిస్తున్న విద్యాబాలన్‌కు బాలయ్య కుమార్తె తేజస్విని, అల్లుడు భరత్‌లు శుభాకాంక్షలు తెలిపారు.
ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా తెరమీదికొస్తున్న ఆయన బయోపిక్ చిత్రంలో ఆయన సినీ ప్రయాణం, వివాహం, రాజకీయ జీవితాన్ని చూపించనున్నారు. జనవరి 9వ తేదిన ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్నది నిర్మాతల ఆలోచన. ఎం ఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. విద్యాబాలన్ కూడా బసవ తారకం పాత్రను సీరియస్‌గా తీసుకొని ఈ చిత్రంలో నటిస్తున్నారని వినికిడి. ఆ పాత్రపై మరింత అవగాహన పెంచుకోవడం కోసం ఆమె ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో కూడా ఎక్కువ సేపు గడపాలని భావిస్తున్నారట.