ఎన్.టి.ఆర్ బయోపిక్ రిలీజ్ ప్రోమో : ఎన్.టి.ఆర్ అంటే ఆమెకు అంత ప్రేమ
ఎన్.టి.ఆర్ బయోపిక్ రిలీజ్ ప్రోమో
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు యదార్థగాథ ఆధారంగా తెరకెక్కిన ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా కథా నాయకుడు, మహా నాయకుడు అని రెండు భాగాలుగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సంక్రాంతి కానుకగా మొదట కథా నాయకుడు విడుదల కానుండగా ఫిబ్రవరిలో మహానాయకుడు మూవీ ఆడియెన్స్ ముందుకు రానుంది. కథా నాయకుడు సినిమా విడుదల సమీపిస్తున్న తరుణంలో తాజాగా చిత్ర నిర్మాత కూడా అయిన నందమూరి బాలకృష్ణ తమ యూట్యూబ్ ఛానెల్ ద్వారా కథా నాయకుడు రిలీజ్ ప్రోమోను విడుదల చేశారు. ఎన్టీఆర్‌పై ఆయన సతీమణి బసవతారకం ఎంత ప్రేమను కనబర్చేవారో ఈ ప్రోమో ద్వారా తెలియజేశారు. ఎన్టీఆర్ ఇష్టాన్నే ఆమె తన ఇష్టంగా భావించి, అలాగే నడుచుకున్నారని ఈ రిలీజ్ ప్రోమో చూస్తే స్పష్టమవుతోంది. అంతేకాకుండా బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటించిన తీరు ఆకట్టుకోవడం ఖాయం అనేలా ఈ ప్రోమో వుంది. క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో బాలయ్య బాబు, విద్యా బాలన్‌తోపాటు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఎంతో మంది ప్రముఖులు తమ వంతు పాత్రలు పోషించడం విశేషం.