అందరికీ ఆదర్శంగా నిలిచిన ఈ వ్యక్తి పేరు డి.ప్రకాష్ రావు. ఓడిశాలోని కటక్‌లో టీ అమ్ముతూ సాదాసీదాగా జీవనం సాగిస్తుంటాడు. మురికివాడల్లో పిల్లల చదువు కోసం ఈయన ఒక పాఠశాలను కూడా నిర్వహిస్తున్నారు. తన సంపాదనలో చాలా భాగం స్కూల్ నిర్వహణ కోసం ఖర్చు చేస్తున్నారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈయన్ను గుర్తుచేశారు. ఆయన సేవలను కొనియాడారు. ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

61 ఏళ్ల డి.ప్రకాష్ రావు 70 మంది మురికివాడల పిల్లలకు గార్డియన్‌గా ఉంటూ 18 సంవత్సరాలుగా వారిని చదివిస్తున్నారు. ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడిన ఆయన, 'నేను ఆసుపత్రిలో రోగులకు కూడా సహాయం చేస్తాను. నేను ఉదయం 10 గంటల వరకు టీ అమ్ముతాను. ఆ తరువాత ఇక్కడికి వచ్చి పాఠాలు చెబుతాను. నా సంపాదనలో సగ భాగం ఈ స్కూల్ కోసం ఖర్చు చేస్తాను' అని అన్నారు.



 


కటక్‌లోని బుక్షి బజార్ వద్ద డి.ప్రకాష్ రావు చిన్నప్పటి నుంచి టీ అమ్ముతున్నారు. భార్య, ఇద్దరు ఆడ పిల్లలతో ఆయన మురికివడలోనే నివసిస్తున్నారు. 2002లో 'ఆశా వో ఆశ్వాసన' అనే స్కూల్‌ను స్థాపించి.. మురికివాడల్లో ఉంటున్న పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నారు. 1976 నుంచి రక్త దానం చేస్తున్నారు. 1960లో తండ్రి కటక్‌లోని టీ షాప్‌ను ప్రారంభించినప్పటి నుంచి రావు టీ అమ్ముతున్నారు. తండ్రి స్కూల్‌కు పంపించడం దండగ అనే ధోరణిలో ఉండేవారు. రావు భార్య ఎస్సీబీ మెడికల్ కాలేజీలో నర్స్‌గా పనిచేస్తోంది.  


డి.ప్రకాష్ రావు అనర్గళంగా ఎనిమిది భాషలను మాట్లాడుతారు- ఒడియా, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ.


ఈయన టీ స్టాల్‌లో వెరైటీ వెరైటీ 'టీ'లు లభిస్తాయి. షుగర్ ఫ్రీ, లెమన్ టీ ఇలా అనేకం. మీరూ ఒకసారి కటక్ వెళ్తే తప్పక ఈయన టీ స్టాల్‌ను.. స్కూల్‌ను సందర్శించండి. మీకు ఇష్టమైతే కొంత డబ్బును విరాళంగా ఇవ్వండి.