బాలీవుడ్‌లో దేశీ గాళ్‌గా పేరున్న ప్రియాంకా చోప్రా తన ప్రతిభా పాటవాలతో హాలీవుడ్ అవకాశాలు అందిపుచ్చుకోవడమే కాదు... చివరకు తన జీవిత భాగస్వామిని కూడా హాలీవుడ్ నుంచే ఎంపిక చేసుకుందని తెలుస్తోంది. అవును, అంతర్జాతీయ స్థాయిలో పేరున్న పాపులర్ సింగర్ నిక్ జొనస్‌తో ప్రేమలో పడిన ప్రియాంకా చోప్రా అతడితో నిశ్చితార్థం సైతం పూర్తి చేసుకున్నట్టు అమెరికా మీడియా కథనాలు పేర్కొన్నాయి. గత వారమే తన 36వ పుట్టిన రోజు సందర్భంగా అదే రోజు ప్రియాంకా చోప్రా నిశ్చితార్థం చేసుకున్నట్టు పీపుల్‌డాట్‌కామ్ కథనం వెల్లడించింది. ప్రియాంకా చోప్రాతో నిశ్చితార్థం కోసం న్యూయార్క్‌లోని ఓ ఫేమస్ స్టోర్ నుంచి నిక్ జోనస్ రింగ్ కొనుగోలు చేసినట్టు ఆ కథనం ఉటంకించింది. ఈ ఏడాది చివరిలోగా ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోనున్నట్టు ఆ కథనం స్పష్టంచేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



అయితే, తమ నిశ్చితార్థం గురించి వస్తున్న వార్తలను మాత్రం ఈ జంట పట్టించుకోవడం లేదు. ఇప్పటివరకు దీనిపై అవును అని కానీ లేదు అనేటటువంటి ప్రకటన కానీ చేయలేదు. హాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కి తిరిగివచ్చిన తర్వాత అలీ అబ్బాస్ జఫర్ సినిమాలో పీసీ నటిస్తుందనే టాక్ వినిపించింది. అయితే, పీసీ ఇష్టపూర్వకంగానే ఈ సినిమాలో నటించడం లేదని స్పష్టంచేసిన అలీ అబ్బాస్ జఫర్... ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతూ ఇవాళే ఓ ట్వీట్ కూడా చేయడం మరో విశేషం.