తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కొత్త సినిమా కాలా వచ్చే జూన్ 7వ తేదీన విడుదలకు సిద్ధమవతున్న సంగతి తెలిసిందే. అయితే, విడుదలకు మరో 10 రోజులు మిగిలివుందనగా కాలాకు అనుకోని కష్టాలు వచ్చిపడ్డాయి. కర్ణాటకలో కాలా సినిమా విడుదలను అడ్డుకుంటూ అక్కడ పలు కన్నడ ప్రజా సంఘాలు ఆందోళనకు చేపట్టాయి. కావేరి నది జలాల వివాదంలో తమిళనాడు తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడిన రజినీకాంత్ సినిమాను కన్నడనాట విడుదల చేయనివ్వకూడదు అంటూ పలువురు ఆందోళనకారులు కర్ణాటక ఫిలిం ఛాంబర్ కు లేఖలు రాశారు. తాజాగా ఈ వివాదంపై స్పందించిన కర్ణాటక ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు స ర గోవిందు.. ఆందోళనకారులు కాలా విడుదలను అడ్డుకుంటాం అంటూ ఆ లేఖల్లో స్పష్టంచేశారని అన్నారు. తమిళనాడు తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్‌కి అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న కర్ణాటకలో కాలా సినిమా విడుదల అవకపోతే అది అటు నిర్మాతలకు నష్టం తీసుకురావడం ఖాయం అని కన్నడ సినీవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 

ఇదిలావుంటే, కాలా సినిమాను కర్ణాటకలో రిలీజ్ చేయనున్న కర్ణాటక డిస్ట్రిబ్యూటర్ తాజాగా కర్ణాటక ఫిలిం ఛాంబర్ ప్రతినిధులతో చర్చలు చేపట్టినట్టు తెలుస్తోంది. కర్ణాటకలో కాలా సినిమా విడుదల కానుందా లేదా అనే విషయమై గురువారం ఓ అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నట్టు సమాచారం. అప్పటివరకు కాలాపై కర్ణాటకలో సస్పెన్స్ తప్పదు.