ఫిల్మ్ స్కూల్ ప్రారంభించబోతున్న రామ్ గోపాల్ వర్మ
ప్రముఖ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాను ఫిల్మ్ స్కూలు ప్రారంభిస్తానని ప్రకటించారు.
ప్రముఖ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాను ఫిల్మ్ స్కూలు ప్రారంభిస్తానని ప్రకటించారు. ‘ఆర్జీవీ అన్ స్కూల్’ అనే పేరుతో తాను ఆ స్కూలును ప్రారంభిస్తానని ఆయన తెలిపారు. రామ్ స్వరూప్, శ్వేతారెడ్డిలతో కలిసి తాను ప్రారంభిస్తున్న ఈ స్కూలులో పాఠాలు, క్లాస్ రూములు ఉండవని ఆర్జీవి అన్నారు. తాను ఈ స్కూలు ద్వారా ఏమీ నేర్పనని.. ఏదో నేర్చుకోవాలని వచ్చిన వారిలో ప్రతిభను వెలికితీస్తానని.. చిత్రసీమలోకి రావాలని భావించే వారి ఆలోచనపరిధి పెంచేందుకు ఈ స్కూలు ఉపయోగపడుతుందని ఆర్జీవి అన్నారు.
ఈ స్కూలు ద్వారా ఏమైనా విద్యార్థులు నేర్చుకోవాల్సింది ఉందంటే అది ఫ్లాప్ సినిమాలు చూసే నేర్చుకుంటారని.. వారితో హిట్ సినిమాల గురించి పెద్దగా మాట్లాడనని ఆర్జీవి తెలిపారు. ముంబయితో పాటు హైదరాబాద్, అమెరికాలో కూడా ఈ స్కూలు బ్రాంచిలు ఉంటాయని అన్నారు.
ఇప్పటి వరకు చాలా ఫిల్మ్ స్కూల్స్ వచ్చాయని.. కాకపోతే ‘ఆర్జీవీ అన్ స్కూల్’ వీటన్నింటి కంటే భిన్నంగా, వైవిధ్యంగా, వినూత్నంగా ఉండబోతుందని ఆర్జీవి అన్నారు. అయితే పదో తరగతి, ఇంటర్, ఇంజినీరింగ్ రెండేసి సార్లు తప్పిన తానే ఈ రోజు ఓ స్కూలు ప్రిన్సిపల్ అవతారం ఎత్తడం ఆశ్చర్యంగా ఉందని ఆర్జీవి అన్నారు.
పూర్తిగా సాంకేతికత పట్ల అవగాహన లేని రోజుల్లోనే తాను "శివ" సినిమా తీశానని.. కానీ నేడు సాంకేతికత స్థాయిని దాటి జనాల జీవితాలలోకి చొచ్చుకొస్తున్నా.. ఫిల్మ్ స్కూల్స్ మూసధోరణిలోనే సాగుతున్నాయని.. అందుకు సమాధానం ఇవ్వడం కోసమే తాను ఈ స్కూలు ప్రారంభించాలని భావించానని.. త్వరలోనే అడ్మిషన్స్‌తో పాటు మరిన్ని వివరాలు ప్రకటిస్తానని ఆర్జీవి అన్నారు.