షారూక్ కు షాక్ ; ఆ పోస్టుపై విమర్శల వర్షం
బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ చేసిన ఆ పోస్టుపై విమర్శల వర్షం కురుస్తోంది. దీనిపై ఓ వర్గం వారు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళ్లినట్లయితే.. గణేష్ చతుర్థి సందర్భంగా ఇంట్లో తన చిన్న కుమారుడు అబ్ రామ్ వినాయకుడికి పూజ చేస్తున్న ఫొటోను షారుఖ్ తన ఇన్షాగ్రమ్ లో అప్ లోడ్ చేశాడు. 'మా చిన్నోడు పిలిచాడు...గణపతి బప్పా ఇంటికి వచ్చాడు' అంటూ ఫొటోకు క్యాప్షన్ పెట్టాడు
షారుఖ్ ఖాన్ చేసిన ఈ పోస్టుపై కొందరు ముస్లింలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఒక ముస్లిం అయి ఉండి ఇంట్లో వినాయకుడి విగ్రహం పెట్టుకుని ఎలా పూజ చేస్తావు ? అని మండిపడుతున్నారు. మరికొందరైతే నీవసలు ముస్లింవేనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇస్లాంలో విగ్రహారాధనకు చోటు లేదని...అలాంటప్పుడు ఒక ముస్లిం అయి ఉండి నువ్వెలా పూజలు చేస్తావంటూ మండిపడ్డారు. ముస్లిం అయివుండి... గణేష్ చతుర్థి చేసుకుంటావా ? అంటూ మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.