శశిథరూర్‌కి సినిమా ఆఫర్ వచ్చిందా..?
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సినిమాలో తనకు కొన్ని సంవత్సరాల క్రితం ఓ ఆఫర్ వచ్చిందని.. తనను దర్శకుడు విదేశాంగ మంత్రి పాత్రలో నటించమని కోరారని శశిథరూర్ తెలిపారు. అయితే తాను ఆసక్తి లేదని చెప్పి.. ఆ అవకాశాన్ని వదులుకున్నానని ఆయన అన్నారు. ఓ స్నేహితుడి సూచన మేరకే తాను ఆ ఆఫర్ వదిలేసానని ఎంపీ అన్నారు.
అలాగే "అందాజ్ అప్నా అప్నా" చిత్రంలో తాను నటించానని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయని.. కానీ అవి అవాస్తవాలను.. ఆ వార్తలను నమ్మవద్దని కూడా తెలిపారు శశిథరూర్. ఆ సినిమా విడుదల అయ్యేసరికి తాను చాలా యవ్వనదశలో ఉన్నానని.. అయినా ఆ సినిమాలో తనకు అవకాశం రాలేదని తెలిపారు థరూర్. ఒక రకంగా చెప్పాలంటే..తాను యంగ్‌గా ఉన్నప్పుడు సినిమా ఆఫర్ రాలేదని.. తనకు వయసు మీద పడ్డాకే ఓ చిత్రంలో ఆఫర్ వచ్చిందని.. అలా ఎందుకు జరిగిందో తనకే అర్థం కావడం లేదంటూ నవ్వుతూ చెప్పారు థరూర్.
కాగా.. శశిథరూర్ భార్య సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి కేసు ఆధారంగా అప్పట్లో ఓ చిత్రం వస్తుందనే వార్తలు కూడా వచ్చాయి. ఆ చిత్రంలో మనీషా కొయిరాలా, సునంద పుష్కర్ పాత్రను పోషిస్తున్నారనే వదంతులు కూడా వచ్చాయి. కన్నడంలో వీరప్పన్ బయోపిక్ తీసిన ఏఎంఆర్ రమేష్ ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారని పలు వార్తలు అప్పట్లో సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.