బాలీవుడ్ నటి శిల్పాశెట్టిపై క్వాంటాస్ ఎయిర్ వేస్ సిబ్బంది జాతి వివక్ష వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. ఆస్ట్రేలియా విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటనను శిల్పాశెట్టి స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంటులో పోస్టు చేశారు. లగేజీ చెకింగ్ జరుగుతున్నప్పుడు సిబ్బందిలో ఒకామె తనతో మాట్లాడుతూ "మేం బ్రౌన్ జాతివాళ్లం... మాతో జాగ్రత్తగా మాట్లాడండి" అని బెదిరించిందని శిల్పాశెట్టి పేర్కొన్నారు. శిల్పాశెట్టి బ్యాగ్ ఓవర్ సీజ్ అయ్యిందని తెలుపుతూ.. వేరే కౌంటర్‌లో బ్యాగ్‌ని చూపించమని చెప్పినప్పుడు సిబ్బందిలోని ఓ మహిళ ఈ వ్యాఖ్యలు చేశారని శిల్పాశెట్టి ఆరోపించారు. అయితే వేరే కౌంటర్ వద్దకు వెళ్లి మాట్లాడినప్పుడు... అక్కడి ఉద్యోగిని మాత్రం చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడిందని శిల్పాశెట్టి తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే కౌంటర్ మూసివేస్తున్న ఆ సమయంలో తాను చాలా ఇబ్బంది పడ్డానని.. శరీర రంగును బట్టి మనిషిని అవమానించడం సరికాదని.. ఈ విషయం క్వాంటాస్ ఎయిర్ వేస్ సిబ్బంది తెలుసుకుంటే మంచిదని శిల్పాశెట్టి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన ఆలోచనలను పంచుకున్నారు. ఈ మధ్యకాలంలో విదేశాలకు వెళ్తున్న బాలీవుడ్ నటులకు ఏదో ఒక సందర్భంలో ఇలాంటి ఇబ్బందులు ఎదురు అవుతూనే ఉన్నాయి. వెబ్ సిరీస్ షూటింగ్ కోసం జార్జియా వెళ్లిన నటి రిచా చద్దాకు కూడా గతంలో ఇలాంటి అనుభవమే ఎదురైంది.


శిల్పాశెట్టి 2007లో సెలబ్రిటీ బిగ్ బ్రదర్ రియాలిటీ షోలో పాల్గొనప్పుడు కూడా ఆమెపై ఇలాంటి జాతి వివక్ష వ్యాఖ్యలనే ఒకామె చేయడం జరిగింది. అయితే అదే సీజన్‌లో శిల్పాశెట్టి బిగ్ బ్రదర్ టైటిల్ గెలుచుకోవడం గమనార్హం. అనేక సూపర్ హిట్ బాలీవుడ్ సినిమాల్లో నటించిన శిల్పాశెట్టి 2009లో వ్యాపారవేత్త రాజ్ కుంద్రాని పెళ్లి చేసుకున్నారు. శిల్పాశెట్టి తెలుగులో కూడా పలు చిత్రాలలో నటించారు. సాహసవీరుడు సాగరకన్య, వీడెవడండి బాబు, ఆజాద్, భలేవాడివి బాసు లాంటి చిత్రాలలో శిల్పాశెట్టి నటించారు.