చైనాలో సందడి చేయనున్న సల్మాన్ ఖాన్ `సుల్తాన్`
సల్మాన్ ఖాన్ నటించిన `సుల్తాన్` బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాను చైనాలో కూడా విడుదల చేయనున్నారు ఆ చిత్ర నిర్మాతలు.
సల్మాన్ ఖాన్ నటించిన "సుల్తాన్" బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాను చైనాలో కూడా విడుదల చేయనున్నారు ఆ చిత్ర నిర్మాతలు. ఆగస్టు 31వ తేదిన ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రాన్ని చైనాలో కూడా మార్కెటింగ్ చేస్తున్న యశ్ చోప్రా ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ అవతార్ పనేశర్ మాట్లాడుతూ "ఇండియన్ సినిమాలకు చైనాలో కూడా ఈ మధ్యకాలంలో ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పడుతోంది. సల్మాన్ ఖాన్ నటించిన "భజరంగీ భాయ్‌జాన్" చైనాలో కూడా ఎన్నో రికార్డులు తిరగరాసింది.
"సుల్తాన్" సినిమా చైనాలో రిలీజవుతున్న సల్మాన్ రెండవ చిత్రం. చైనాలో భారతీయ సినిమాలకు అభిమానులు బాగా పెరుగుతున్నారు. ముఖ్యంగా మన సినిమాల్లో ఇమోషన్స్‌కు వారు బాగా కనెక్ట్ అవుతున్నారు. అది చాలా గొప్ప విషయం. కళకు దేశ సరిహద్దులతో సంబంధం లేదని.. ఏ భాషా చిత్రమైనా అందులో కంటెంట్ బాగుంటే ఆదరిస్తారు అన్నదానికి చైనా మార్కెట్ గొప్ప ఉదాహరణ" అని తెలిపారు.
ఫిల్మ్ ట్రేడ్ ఎనలిస్ట్ తరన్ ఆదర్శ్ కూడా "సుల్తాన్" సినిమా చైనాలో విడుదల అవుతుందని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. దాదాపు ఈ సినిమాని 11000 స్క్రీన్స్‌లో ప్రదర్శించనున్నట్లు.. అలాగే ప్రతీ రోజు 40,000 షోలకు తాము టార్గెట్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో తెరకెక్కిన "సుల్తాన్" చిత్రంలో సల్మాన్ ఖాన్, అనుష్క శర్మ, రణదీప్ హుడా, అమిత్ సాద్‌లు ప్రధాన తారాగణం కాగా.. ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా నిర్మించారు. విశాల్ శేఖర్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు.