The Indian Story Review: రాజ్ భీమ్ రెడ్డి, జరా ఖాన్ హీరో హీరోయిన్లుగా నటించిన ది ఇండియన్ స్టోరి మూవీ నేడు (మే 3)న థియేటర్స్‌లోకి వచ్చింది. మన ఇండియన్ సొసైటీలో ఉన్న ఒక సమస్యను నేపథ్యంగా తీసుకుని అన్ని కమర్షియల్ అంశాలతో ఈ సినిమా తెరకెక్కించారు. ది భీమ్ రెడ్డి క్రియేషన్స్ బ్యానర్‌పై రాజ్ భీమ్ రెడ్డి నిర్మిస్తూ హీరోగా నటించారు. ఆర్.రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించగా.. ఈ సినిమా థియేటర్స్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా రివ్యూలో చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కథేంటంటే..


హిందూ వర్గానికి నాయకుడు శ్రీరామ్ (రామరాజు), ముస్లిం వర్గ లీడర్ కబీర్ ఖాన్ (ముక్తార్ ఖాన్). ఈ ఇద్దరు నాయకులు ప్రజలను రెచ్చగొడుతూ పరస్పరం దాడులు చేసుకునేలా చేస్తుంటారు. విశాఖ నుంచి వచ్చిన రెహమాన్ (రాజ్ భీమ్ రెడ్డి)కి ఓ విషయంలో ఫేకు (చమ్మక్ చంద్ర) అనే స్నేహితుడు హెల్ప్ చేస్తాడు. సాయం చేస్తానంటూ స్నేహితుడే మోసం చేసే ప్రయత్నం చేస్తాడు. కబీర్ ఖాన్‌ను శ్రీరామ్ వర్గం చేసిన హత్యాయత్నం నుంచి రెహమాన్ కాపాడతాడు. కబీర్ ఖాన్ బలవంతం మీద అతని వర్గంలో రెహమాన్ చేరతాడు. ఆప్తుడిగా మారిన రెహమాన్‌ను కబీర్ ఖాన్ హత్య చేయాలని అనుకుంటాడు. ఇందుకు కారణం ఏంటి..? జర్నలిస్ట్ రాజ్ రెహమాన్‌గా ఎందుకు మారాడు. అతను కబీర్ ఖాన్ వర్గంలోకి ఎందుకు చేరాడు. కబీర్ ఖాన్ కూతురిలా చూసుకునే ఆయేషాతో రెహమాన్ ప్రేమ సక్సెస్ అయ్యిందా లేదా..? మతం పేరుతో ప్రజల్ని విడదీసిన ఈ ఇద్దరు నాయకుల ప్లాష్ బ్యాక్ ఏంటి..? కబీర్ ఖాన్, శ్రీరామ్ పుట్టించే మత విద్వేషాల నుంచి సమాజాన్ని రెహమాన్ ఉరఫ్ రాజ్ ఎలా కాపాడాడు అనేది మిగిలిన కథ.


రివ్యూ 


రాజకీయాలు, రాజకీయ నాయకుల వ్యవహారాలు అంతు చిక్కవు. పైకి బద్ధ శత్రువుల్లా కనిపించి రోజూ మీడియా ముందు తిట్టుకునే నాయకులు ప్రైవేట్ పార్టీల్లో మాత్రం కలిసి ఎంజాయ్ చేస్తుంటారు. వారు నవ్వుకుంటూ మాట్లాడుకోవడం చూసి ప్రజలు అవాక్కవుతుంటారు. ఇలాంటి సందర్భాలు ఎన్నో.. ఇలా రాజకీయ నాయకులు తమ స్వార్థంతో ప్రజల మధ్య మతం పేరుతో చిచ్చు పెడుతుంటారు జాగ్రత్త అని మంచి సందేశాన్నిచ్చింది "ది ఇండియన్ స్టోరి" సినిమా. కబీర్ ఖాన్, శ్రీరామ్ క్యారెక్టర్స్ పరిచయంతో సినిమా మొదలవుతుంది. రెహమాన్ (హీరో రాజ్ భీమ్ రెడ్డి) వైజాగ్ నుంచి రావడం, అతను ఫ్రెండ్ ఫేకు (చమ్మక్ చంద్ర)ను కలవడం, వాళ్లిద్దరు బంగారు బిస్కెట్లను అమ్మేందుకు పడే పాట్లతో సరదాగా సినిమా టేకాఫ్ అవుతుంది. అసలు కథ మాత్రం ప్లాష్ బ్యాక్‌లో వచ్చే ఇద్దరు పిల్లలు అన్నం కోసం చనిపోయే సీన్ తో మొదలవుతుంది. కబీర్ ఖాన్‌ను హత్య నుంచి రెహమాన్ కాపాడటంతో సినిమాలో సీరియస్ నెస్ మొదలవుతుంది. 


ఆస్పత్రిలో నర్సుతో చమ్మక్ చంద్ర చేసే కామెడీ, హీరోకు రాజ్ భీమ్ రెడ్డికి, చమ్మక్ చంద్రకు మధ్య వచ్చే సీన్స్ బాగా నవ్వించాయి. హీరోహీరోయిన్స్ మధ్య కూడా ఒక చిన్న ఎమోషనల్ లవ్ స్టోరీ చూపించారు. జర్నలిస్ట్‌గా ఉన్న రాజ్ రెహమాన్‌గా ఎందుకు మారాడు..? మారి ఏం చేశాడు అనేది దర్శకుడు ఆర్ రాజశేఖర్ రెడ్డి ఆసక్తికరంగా తెరకెక్కించాడు. ఒకవైపు కామెడీగా ఉంటూనే కథలో సీరియస్ నెస్ కంటిన్యూ అయ్యేలా చూసుకున్నాడు దర్శకుడు. మతం పేరుతో ప్రజలకు తప్పుడు సందేశం వెళ్లకుండా కేవలం తాము చెప్పదల్చుకున్న పాయింట్‌ను ఈ సినిమాలో చూపించారు నిర్మాత రాజ్ భీమ్ రెడ్డి, దర్శకుడు. మతం పేరుతో మన మధ్య చిచ్చు పెట్టేవారి కుట్రలను గమనించాలి అనే మంచి సందేశాన్నిచ్చిందీ సినిమా.


ఈ సినిమాలో హీరో రాజ్ భీమ్ రెడ్డి కథకు, తన పాత్రకు ఎంత కావాలో అంతే నటించాడు. ఎక్కువ హంగులకు పోలేదు. హీరో రాజ్ భీమ్ రెడ్డి చేసిన ఇంటర్వెల్ తర్వత వచ్చే మూడున్నర నిమిషాల లెంగ్తీ ఫైట్స్ సీక్వెన్స్ ఈ సినిమాకే హైలైట్. యాక్షన్ సీక్వెన్సులను బాగా తెరకెక్కించారు. ఫేకుగా చమ్మక్ చంద్రకు తన కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ ఇది. ఉన్నంత సేపూ నవ్విస్తూనే ఉన్నాడు చమ్మక్ చంద్ర. అలాగే హీరోయిన్ జరా ఖాన్ పర్ పర్ఫార్మెన్స్ బాగుంది. శ్రీరామ్‌గా రామరాజు, కబీర్ ఖాన్‌గా  ముక్తార్ ఖాన్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. టెక్నికల్‌గా "ది ఇండియన్ స్టోరి" సినిమా ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ బాగున్నాయి. చివరగా మతం కంటే మనుషులుగా కలిసి ఉండటం ముఖ్యమనే సందేశాన్ని “ది ఇండియన్ స్టోరి” ద్వారా ఇచ్చే ప్రయత్నం చేశారు.