ఫుట్‌పాత్ మీద బైకులు నడిపితే ఖబడ్దార్: బెంగుళూరులో ఓ యువతి వినూత్న నిరసన
బెంగుళూరులో రోజు రోజుకీ పెరిగిపోతున్న ట్రాఫిక్ సామాన్య ప్రజలను ఎంతలా ఇబ్బంది పెడుతుందో చెప్పే సంఘటన ఇది. సిటీలో ట్రాఫిక్ ఎక్కువవుతున్నప్పుడు బండి టర్న్ చేయడం కూడా కష్టమవడం సహజం.
బెంగుళూరులో రోజు రోజుకీ పెరిగిపోతున్న ట్రాఫిక్ సామాన్య ప్రజలను ఎంతలా ఇబ్బంది పెడుతుందో చెప్పే సంఘటన ఇది. సిటీలో ట్రాఫిక్ ఎక్కువవుతున్నప్పుడు బండి టర్న్ చేయడం కూడా కష్టమవడం సహజం. అలాంటప్పుడు బైక్ నడిపేవారు ఫుట్‌పాత్ మీద జనాలను నడవనీయకుండా.. ఆ స్థలాన్ని కూడా వారే కబ్జా చేయడం చూస్తుంటాం. అలాంటి వారికి బుద్ధి చెప్పడానికే బెంగుళూరులో మంజు థామస్ అనే అమ్మాయి ఓ వినూత్న నిరసనకు శ్రీకారం చుట్టింది.
తనకు ఎక్కడైనా ఇలా ఫుట్‌పాత్‌ల మీద బైక్స్ నడిపేవారు కనిపిస్తే చాలు.. వెంటనే అక్కడికి వెళ్లి వారు బండి నడపకుండా అడ్డుపడుతుంది. కొంచెం కష్టమైనా... రోడ్డు మీదే బండిని నడపమని కోరుతుంది. అలా ఫుట్‌పాత్ మీద బండి నడపడం వల్ల సామాన్య జనం పడే ఇబ్బందులు గురించి.. అలాగే వాటి వల్ల ఎదురయ్యే ప్రమాదాల గురించి కూడా చెబుతుంది. అయితే జనాలు వినరు కదా.. ఆమెను పిచ్చిదానిలా చూసేవారు కొందరైతే.. మరికొందరు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తుంటారు.
ఈ మధ్య కూడా మంజుకి అలాంటి సంఘటనే ఎదురైంది. కొందరు యువకులు దర్జాగా ఫుట్‌పాత్ మీద బండి పోనిస్తుంటే.. ఆ బండి నడిపే వ్యక్తిని మంజు వెళ్లి అడ్డుకుంది. దాంతో అతగాడు తీవ్ర ఆవేశానికి గురయ్యాడు. "ఈ ఫుట్‌బాత్ ఏమైనా నీ అబ్బ సొత్తా" అని ఎదిరించి మాట్లాడాడు. కానీ.. ఈమె మాత్రం ఊరుకుంటుందా.. "కాదు.. నా అబ్బ సొత్తు కాదు.. నా అమ్మ సొత్తు. భారతదేశం నాకు అమ్మ లాంటిది. నువ్వు ఎలా పడితే అలా చట్టాన్ని అతిక్రమిస్తూ వెళ్తానంటే జనాలు ఒప్పుకోరు" అని గట్టిగానే చెప్పింది. అయినా అతగాడు వినలేదు. పైగా పచ్చి బూతులు తిట్టాడు.
అయినా సరే మంజు అక్కడ నుండి వెళ్లలేదు. ఆ వాహనానికి ఎదురుగా నిలబడి పోయింది. ఇక చేసేదేమీ లేక ఆ అబ్బాయిలే వెళ్లిపోయారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోని ఎవరో నెటిజన్ తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అది బాగా వైరల్ అవుతోంది. కొందరు మంజు చేసిన పనిని ప్రశంసిస్తే.. మరికొందరు భారతదేశంలో ఇలాంటివి పరిష్కారం లేని సమస్యలు అని.. ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీసులు ఆమెను చూసి బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు
అయితే తను ఇలాంటి నిరసన చేయడానికి కూడా కారణముందని చెబుతోంది మంజు థామస్. బెంగుళూరు సెయింట్ జాన్స్ ప్రాంతం నుండి రోజూ ఫుట్ పాత్ మీద నడిచి వెళ్తున్నప్పుడు తాను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని.. వాహనాలు నడిపేవారు ఫుట్ పాత్ కబ్జా చేయడమే కాదు.. ఫుట్ పాత్ మీద నడుస్తూ వెళుతూ తమకు అడ్డొచ్చేవారి మీద కూడా విసుక్కుంటూ ఉంటారని..తప్పు చేయనివారు.. తప్పు చేసినవారి దగ్గర తిట్లు తినడమేంటని భావించి.. తాను ఆ రోజు నుండీ అలా వెళ్లేవారిని ధైర్యంగా ఎదుర్కొనడానికి శ్రీకారం చుట్టానని ధైర్యంగా చెప్పింది మంజు. తనను కూడా ఫుట్‌పాత్ మీద చాలామంది ఇబ్బంది పెట్టారని.. అలాంటి వారికి ట్రాఫిక్ పోలీసులు పాఠం చెప్పినా చెప్పకపోయినా.. తాను చెప్పడానికి సిద్ధమయ్యానని అంటోంది మంజు.