ప్రతిఏటా లక్షలో 100 మందికి క్యాన్సర్
"క్యాన్సర్ నేడు ప్రపంచాన్ని వణికిస్తున్న ఒక మహమ్మారి. దీనిని అదుపు చేయాలంటే అవగాహన పెంచుకొని, సక్రమంగా మసులుకుంటే నివారించవచ్చు" అని డాక్టర్లు, క్యాన్సర్‌ను జయించిన వ్యక్తులు అంటుంటారు. ఏదైనా రోగం వస్తే భూతద్దంలో పెట్టి చూడాలా? అదేమీ కాదులే అంటూ గమ్మున కూర్చుంటే ఇక అంతే సంగతులు. అది ముదిరి పాకాన పడి డబ్బులనైనా వదిలిస్తుంది లేదా చావునైనా పరిచయం చేస్తుంది. ఎందుకని అంత లైట్‌గా తీసుకుంటారో అర్థంకాదు నేటి సమాజం. అలా వెళ్లి డాక్టర్‌ను చూపించుకొని వస్తే ఆ వ్యాధి ఏదో నిర్ధారణ అయిపోతుందిగా..!
క్యాన్సర్ గురించి అవగాహన లేక ఎంతో మంది రోగులు ఇలా చివరి దశవరకు చేరుకొని మృత్యువాత పడుతున్నారు. చాలామంది రోగులు తమకు వ్యాధి ఉన్న విషయం తెలియకుండానే జీవిస్తున్నారు. ఆఖరి క్షణాల్లో కొందరు రోగులు వ్యాధి తెలుసుకొని లబోదిబో అంటుండగా, మరికొందరు ఆ వ్యాధి ఏంటో కూడా తెలియకుండా చనిపోతున్నారు. కారణం ఏదైతేనేం క్యాన్సర్ వ్యాధి నేడు చాపకింద నీరులా తయారైంది.
ఏటా లక్ష మందిలో 100మంది ఈ వ్యాధులకు గురవుతున్నట్లు డాక్టర్లే ప్రకటిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. దాదాపుగా అన్ని రకాల క్యాన్సర్ వ్యాధుల నివారణకు మందులు అందుబాటులోకి వచ్చాయి. ఎలాంటి కాన్సర్ నైనా ప్రారంభ దశలో గుర్తించి, సకాలంలో ట్రీట్మెంట్ అందిస్తేనే నివారించవచ్చని, అదే రెండుగాని, అంతకంటే ఎక్కువ దశలకు చేరుకుంటే నివారించడం కష్టమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చాలామంది వయస్సు పైబడిన వారికే క్యాన్సర్ వస్తుందనుకోవడం అపోహ మాత్రమే అని, చిన్నపిల్లల్లో, యువకుల్లో, మధ్య వయసువారిలో ఇలా అన్ని వయసుల వారికీ క్యాన్సర్ వస్తుందని వైద్యులు ఢంకా బజాయించి మరీ చెప్తున్నారు. "దయచేసి వ్యాధి వస్తే డాక్టర్‌ను సంప్రదించండి, వ్యాధి ఏదో నిర్థారించుకోండి" అని డాక్టర్లు అంటున్నారు.