బాంబు కోసం వస్తే.. బంగారం దొరికింది..!
అంతర్జాతీయ విమనాశ్రయంలో బాంబు ఉందని ఫిర్యాదు రావడంతో సోదాలు జరిపిన పోలీసులకు ఆఖరికి అది పుకారు అని తేలింది. అయితే ఇదే క్రమంలో వారు చేసిన తనిఖీల్లో వాష్‌రూంలో 3 కేజీల బంగారం దొరకడం గమనార్హం.
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమనాశ్రయంలో బాంబు ఉందని ఫిర్యాదు రావడంతో సోదాలు జరిపిన పోలీసులకు ఆఖరికి అది పుకారు అని తేలింది. అయితే ఇదే క్రమంలో వారు చేసిన తనిఖీల్లో వాష్‌రూంలో 3 కేజీల బంగారం దొరకడం గమనార్హం. ఈ రోజు ఉదయం ఎయిర్ పోర్టులో ఎవరో బాంబు పెట్టారనే సమాచారం అందడంతో సీఐఎస్‌ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యురిటీ ఫోర్స్) బలగాలు విమనాశ్రయంలో సోదాలు చేపట్టారు. బాంబు స్వ్కౌడ్‌ను రప్పించారు. ఎయిర్ పోర్టులో కూడా ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.
అయితే సిబ్బంది బాంబును గాలిస్తుండగా.. వారికి లేడీస్ వాష్‌రూంలో బాంబుకు బదులు బంగారం దొరికింది. తెల్లని పేపర్ టేప్‌లో చుట్టి ఉన్న ఓ ప్యాకెట్‌లో 3 కిలోల బరువున్న 3 బంగారు బిస్కెట్లు ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక కిలో బరువు ఉంది. ఆ బంగారం ఎవరిది? ఎక్కడి నుంచి వచ్చింది? అనే విషయాలు ఇంకా వెల్లడికాలేదు. ఈ బంగారం ధర సుమారు రూ.90 లక్షలు ఉంటుందని అంచనా. ఈ క్రమంలో కస్టమ్స్ అధికారులకు పోలీసులు సమాచారం అందించి.. ఆ తర్వాత బంగారం కూడా అప్పగించి తదుపరి దర్యాప్తు ప్రారంభించారు.
"ఈ విషయం గురించి కస్టమ్స్ అధికారులకు తెలియజేశాము. బంగారాన్ని వారికి అప్పగించాము. వారు దర్యాప్తును ప్రారంభించారు" అని ఎయిర్ పోర్టు భద్రతా అధికారి ఒకరు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.