సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి ఘటనలో 39కి చేరిన అమరవీరుల సంఖ్య
సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి ఘటనలో 39కి చేరిన అమరవీరుల సంఖ్య
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామ జిల్లా అవంతిపురలో 2500 మంది జవాన్లతో వెళ్తున్న సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌కి చెందిన ఉగ్రవాది జరిపిన ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరు సంఖ్య 39కి చేరింది. మరికొంత మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరు జవాన్ల పరిస్థితి విషమంగా ఉందని సీఆర్పీఎఫ్ అధికారవర్గాలు తెలిపాయి. 78 బస్సులతో కూడిన సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్ జమ్మూ నుంచి శ్రీనగర్ వైపు వెళ్తుండగా అదును చూసుకుని ఆదిల్ అహ్మద్ అనే ఉగ్రవాది ఈ దురాగతానికి పాల్పడ్డాడు. దాడి అనంతరం సైతం జవాన్లను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది.
ఐఈడీ పేలుడు కారణంగా జవాన్లు ప్రయాణిస్తున్న మిలిటరీ వాహనం పూర్తిగా దెబ్బతినగా.. అందులో ప్రయాణిస్తోన్న 39 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అమరులైన వీర జవాన్ల మృతదేహాలు ముక్కలుముక్కలై ఘటనాస్థలంలో చెల్లాచెదురుగా పడిపోయాయి. సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. సరైన సమయంలో పాక్‌కి ధీటైన జవాబు చెబుతాం అని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు.