56 శాతం ఇంజనీరింగ్ విద్యార్థులు మ్యాథ్స్ లో ఫెయిల్
సోమవారం అన్నా విశ్వవిద్యాలయం ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఫలితాలను విడుదల చేసింది.
తమిళనాడులో విద్యా వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో ఇది చూస్తే తెలుస్తుంది. సోమవారం అన్నా విశ్వవిద్యాలయం మొదటి సెమిస్టర్ ఫలితాలను విడుదల చేసింది. 500పైగా ఇంజనీరింగ్ కళాశాలల నుండి 1.13 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో గణితం-1 పరీక్ష రాసిన విద్యార్థుల్లో 56 శాతం మంది ఫెయిల్ అయ్యారు.
"ప్లస్ -1లో కష్టపడి చదివిన విద్యార్ధులు సులభంగా ఇంజనీరింగ్ మ్యాథ్స్ ను క్లియర్ చేయవచ్చు. గైడ్లు, క్వశ్చన్ బ్యాంక్, బ్లూ ప్రింట్లపై ఆధారపడి చదివిన వారు పరీక్షల్లో ఇబ్బందిపడుతున్నారు" అని విద్యావేత్త, కెరీర్ విశ్లేషకుడు జయప్రకాష్ ఎ.గాంధీ అన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే, ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది 10 శాతం పెరిగింది.
"నీట్ మీద గందరగోళం కారణంగా, ఇంజనీరింగ్ ప్రవేశాలు ఒక నెల ఆలస్యం అయ్యాయి. ఇతర కారణాలతో పాటు, పరీక్షలకు తక్కువ సమయం ఉండటం కూడా విద్యార్థులను ప్రభావితం చేసింది "అన్నారాయన. అన్నా విశ్వవిద్యాలయం, ఇంజనీరింగ్ కళాశాలలు గణితం పేపర్ క్లియర్ చేయడానికి మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం బ్రిడ్జ్ కోర్సులు ప్రారంభించాల్సిన అవసరం ఉందని అన్నారు. అన్నా యూనివర్సిటీలో టాప్ ర్యాంకులు సాధించినవారు 36 శాతం మంది చదువుతున్నారని, ఈ ఏడాది వారు కూడా ఈ పరీక్షను క్లియర్ చేయలేకపోయారని అన్నారు.
"విద్యార్థులు 3 నుంచి 4 నెలలు తరగతులకు హాజరై పరీక్షలు రాశారు. కానీ మొదటి సెమిస్టర్ పరీక్షల కోసం సిద్ధం కావడానికి ఐదు నుండి ఆరు నెలల అవసరం. పరీక్షలకు సిద్ధం కావడానికి మొదటి సంవత్సరం విద్యార్థులకు మరింత సమయం కావాలని అన్నారు." అని వల్లియంమా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ బి.చిదంబర రాజన్ చెప్పారు.
విద్యార్థులు ఆసక్తిగా ఉన్న సబ్జెక్టుల్లో పాసయ్యారు. ఉదాహరణకు, విద్యార్ధులు ప్రాబ్లం సాల్వింగ్ అండ్ పైథాన్ ప్రోగ్రామింగ్ అనే కొత్త సబ్జెక్టులో బాగా స్కోర్ చేశారు. విద్యార్థులు ఈ సబ్జెక్టులో 61.7 శాతం ఉత్తీర్ణత సాధించారు.