కేరళను భయపెడుతున్న `నిఫా`; పెరుగుతున్న మృతులు
కేరళ రాష్ట్రంలో కొత్త వైరస్ వ్యాప్తి చెందింది.
కేరళ రాష్ట్రంలో కొత్త వైరస్ వ్యాప్తి చెందింది. దానిపేరు 'నిఫా' గా గుర్తించారు వైద్యులు. కోళికోడ్(కాలికట్) జిల్లాలో ఈ వ్యాధి కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి తొమ్మిది మందికిపైగా మరణించగా.. మరో 25 మంది పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
దీంతో ఆరోగ్య శాఖ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ తొమ్మిదిమందికి పైగా మరణించారని చెప్పారు. నమూనాలను సేకరించి పరీక్షలకోసం పుణేలోని పరిశోధనా కేంద్రానికి పంపించామన్నారు. అటు జిల్లా యంత్రంగం అప్రమత్తం అయ్యింది. కొత్త వైరస్ వ్యాప్తితో జనం అస్వస్థతకు గురవుతుండటంతో కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ కేంద్రానికి విన్నవించారు. కేరళ సర్కారు అభ్యర్థనపై స్పందించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌కు చెందిన వైద్యనిపుణులను కేరళకు పంపించారు.
ఈ వైరస్‌తో ఇప్పటివరకు 9 మంది మరణించగా మరో 25 మంది చికిత్స పొందుతున్నారు. ఈ కొత్త వైరస్ పక్షులు, జంతువులు కొరికిన పండ్ల వల్ల వ్యాప్తి చెంది ఉంటుందని ప్రజలు అప్రమత్తమై అలాంటి పండ్లు తినవద్దని వైద్యులు సూచించారు.
నిఫా వైరస్ (ఎన్ఐవి) తీవ్రమైన జ్వరం, శ్వాసకోశ సమస్యలతో మనుషులను తీవ్ర ఇబ్బందికి గురిచేస్తాయి. పందులు ఇతర జంతువుల ద్వారా కూడా ఈ వైరస్ వ్యాపిస్తుంది. దీనికి ఇప్పటివరకు ఎలాంటి వ్యాక్సిన్ లేకపోవడం ఆందోళన కలిగించే అంశం.
1998లో మలేషియాలో ఈ వైరస్ మొదట కనుగొన్నారు. ఇటీవల బంగ్లాదేశ్‌లో 2004లో ఈ వైరస్ వ్యాప్తి చెందింది.