ఒక మాయని గాయం.. 26/11 ఘటన
26/11 ముంబయి దాడుల ఘటన జరిగి 9 ఏళ్ళు అయిన క్రమంలో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రత్యేక సందేశం అందించారు. అసువులు బాసిన పౌరులకు నివాళులు అర్పించారు.
26 నవంబర్, 2008. ఆ రోజు భారతీయ చరిత్రలోనే దేశానికి ఒక మాయని గాయం ఏర్పడింది. దాదాపు పది మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు ముంబై నగరంలో బాంబు దాడులు చేసి జనాలపై విరుచుకుపడ్డారు. మగ, ఆడ, శిశువు, ముసలి, ముతకా అన్న తేడా లేకుండా దొరికిన వారందరినీ కాల్చి చంపారు. 26 నవంబరు నుండి 29 నవంబరు వరకూ మూడు రోజుల పాటు చాలా దారుణమైన రీతిలో హత్యాకాండ జరిగింది. ఈ దాడిలో 173 మంది మరణించగా 308 మంది గాయాల బారిన పడ్డారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం ఉగ్రవాదులు దక్షిణ ముంబైలో ఎనిమిది దాడులు చేశారు. ఛత్రపతి శివాజీ టర్మినస్, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్‌మహల్ ప్యాలెస్ మరియు టవర్, లియోపాల్డ్ కేఫ్, కామా హాస్పటల్, యూదు మతస్తుల ప్రార్థనా స్థలమైన నారిమన్ హోస్, మెట్రో సినిమా హాల్, టైమ్స్ ఆఫ్ ఇండియా ఆఫీస్ బ్యాక్ స్ట్రీట్ మరియు సెయింట్ జేవియర్స్ కాలేజీల పై దాడులు జరిగాయి. ముంబై పోర్టు ఏరియాలోని మాజగావ్ లో మరియు విలే పార్లేలో ఒక టాక్సీలో కూడా పేలుళ్ళు సంభవించాయి.
అయినా భారత పోలీసు బలగాలు రంగంలోకి దిగి ఎదురుతిరిగి పోరాడాయి. తాజ్ హోటల్‌లో దాడి చేసిన వారిని పట్టుకోవడానికి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ రంగంలోకి దిగి, ఆపరేషన్ బ్లాక్ టొర్నడోని ప్రారంభించాయి. అయితే దుండగులు అందరూ తప్పించుకోగా, ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ని మాత్రమే సజీవంగా పట్టుకున్నారు. 21 నవంబరు 2012 తేదిన పూణెలోని ఎరవాడ జైలులో కసబ్‌ని ఉరితీశారు.
ఈ ఘటన జరిగి 9 ఏళ్ళు అయిన క్రమంలో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రత్యేక సందేశం అందించారు. అసువులు బాసిన పౌరులకు నివాళులు అర్పించారు. వీరోచితంగా పోరాడిన సైనికులకు దేశం ఎప్పుడూ రుణపడే ఉంటుందని తెలిపారు. ముంబయి దాడుల విషయంలో ప్రధాన సూత్రధారిగా వ్యవహరించిన హఫీజ్ సయీద్‌ను ఇటీవలే లాహోర్ హైకోర్టు హౌస్ అరెస్టు నుండి విముక్తుడిని చేసిన విషయం తెలిసిందే. అయితే అమెరికా ఈ విషయంపై తీవ్రంగా స్పందించింది. హఫీజ్‌ను విడుదల చేసి పాకిస్తాన్ పరోక్షంగా, ప్రత్యక్షంగా కూడా ఉగ్రవాదాన్ని సమర్థించే విధంగా ప్రవర్తిస్తుందని.. తన వైఖరి మార్చుకోవాలని తెలిపింది.