96 ఏళ్ల వయస్సులో 100కు 98 మార్కులు సాధించిన అవ్వ
96 ఏళ్ల వయస్సులో 100కు 98 మార్కులు సాధించిన అవ్వ
పట్టుదల, ఏదైనా సాధించాలనే ధృడ సంకల్పం ఉంటే, దేనినైనా జయించొచ్చు అని మరోసారి నిరూపించింది ఈ బామ్మ. 96 ఏళ్ల వయస్సులో ఓ పరీక్ష రాసి అందులో 100కు 98 మార్కులు సాధించిన ఘనత సొంతం చేసుకున్న ఈ అవ్వను ఏమని పొగిడినా, ఎంతని పొగిడినా తక్కువే అనిపిస్తోంది. కేరళలోని అలప్పుర జిల్లాకు చెందిన ఈ ముసలమ్మ పేరు కాత్యాయని. కాటికి కాళ్లు చాపిన వయస్సులో ఏం చేసి ఏం సాధిస్తాంలే అని చాలామందిలా అనుకోలేదు ఈ బామ్మ. నూటికి నూరు శాతం అక్ష్యరాస్యత కలిగిన రాష్ట్రంగా పేరు తెచ్చుకోవాలనే సంకల్పంతో... అందరికీ విద్యను అందించాలనే లక్ష్యంతో కేరళ సర్కార్ ప్రవేశపెట్టిన అక్షరలక్షం కార్యక్రమంలో పాల్పంచుకున్న కాత్యాయని అవ్వ తాను చదవడం, రాయడం నేర్చుకుంది. అంతేకాకుండా ఆ పథకం లక్ష్యాన్ని నెరవేర్చేందుకు నిర్వాహకులు నిర్వహించిన పరీక్షలో ఈ అవ్వకు 100కు 98 మార్కులు రావడం విశేషం. గణిత శాస్త్రం సహా అన్ని ఇతర సబ్జెక్టులపై నిర్వహించిన ఈ పరీక్షకు 42933 మంది అభ్యర్థులు హాజరు కాగా వారిలో అత్యధిక వయస్సున్న విద్యార్థి ఈ అవ్వనే.
అక్షర జ్ఞానాన్ని సాధించాలనే అవ్వ ధృడ సంకల్పం ముందు వృద్ధాప్యం కూడా చిన్నబోయింది కాబోలు... అందుకే వయస్సులో పెద్దావిడే అయినా.. అందకిచేత ఆవిడ శభాష్ అనిపించుకుంటోంది. ''తాను ఘనత సాధించడమే కాకుండా పట్టుదల ముందు వయస్సు భారం ఏమాత్రం పనిచేయదు'' అనే సందేశానిస్తూ మరెందరికో స్పూర్తినిచ్చిన ఈ అవ్వకు నిజంగానే చెయ్యెత్తి జైకొట్టాలి.