98వ ఏట ఎంఏ పట్టా అందుకున్న వృద్ధుడు
చదువుకోవాలనే తపన ఉండాలే గానీ.. వయస్సు ఏమాత్రం అడ్డుకాదని నిరూపించాడు ఒక వృద్ధుడు.
చదువుకోవాలనే తపన ఉండాలే గానీ.. వయస్సు ఏమాత్రం అడ్డుకాదని నిరూపించాడు ఒక వృద్ధుడు. ఇప్పటివరకు మనము ఒక 60 ఏళ్ల వ్యక్తి, 70 ఏళ్ల వ్యక్తి పదవ తరగతి పాసయ్యాడు.. డిగ్రీ పాసయ్యాడు అని వార్తలు విన్నాం. కానీ 98 ఏళ్ల వ్యక్తి డిగ్రీ పాసయ్యాడంటే..! ఆ తాతకు చదువుమీదున్న ఆసక్తి, ఇష్టం ఏపాటిదో మీకు ఈ పాటికే అర్ధమయ్యి ఉంటుంది.
నలంద యూనివర్సిటీ నుంచి ఆయన ఎంఏ ఎకనామిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. యువతకు మీరిచ్చే సలహా ఏంటని అడిగితే.. ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉండాలని అన్నారు. ప్రస్తుతం ఈ తాతగారు పిహెచ్ డీ ప్రవేశానికి ప్రిపేరవుతున్నట్లు చెప్పారు.
"మిస్టర్ వైశ్యా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనే కోరికతో ప్రవేశం పొందారు. 2016లో మూడు గంటల ఎంఏ ప్రధమ సంవత్సరం పరీక్షలను కూర్చొని రాశారు. 2017లో చివరి సంవత్సరం పరీక్షలను తన మనవళ్లకంటే తక్కువ వయస్సున్న వారితో కలిసి రాశారు. ఇంగ్లిష్ లో రాసిన ఆయన ఒక్కో పరీక్షకు రెండు డజన్ల సీట్స్ వాడారు" అని నలంద యూనివర్సిటీ అధికారులు తెలిపారు.
ఆ తాతగారి పేరు రాజ్ కుమార్ వైశ్యా. 1920 ఏప్రిల్ 1 వ తేదీన ఉత్తర ప్రదేశ్ లోని బరేలీలో జన్మించారు. 1938లో ఆగ్రా విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్, 1940 లో లా డిగ్రీ పూర్తిచేశారు. ఆయన మాట్లాడుతూ "నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకున్నా.. కానీ కుటుంబ బాధ్యతల కారణంగా విఫలమయ్యా" అన్నారు.
" నేను శాఖాహార ప్రియుడిని. భారతీయ సాంప్రదాయ వంటకాలంటే అమితమైన ఇష్టం. నేను ఎప్పుడూ వేయించిన ఆహారాన్ని తినను. ఎల్లప్పుడూ ఆహారాన్ని నియంత్రణలో తింటాను"అని వైశ్యా అన్నారు. వైశ్యా అద్దాలు లేకుండా చదవగలరు. హిందీ మరియు ఆంగ్ల భాషల్లో రాస్తారు. "నాకు కొన్ని సంవత్సరాల క్రితం వెన్నుముక ఇబ్బంది తలెత్తింది. అప్పుడు వాకర్ సహాయం తీసుకున్నాను" అని చెప్పారు. ప్రస్తతం పాట్నాలోని రాజేంద్ర నగర్ కాలనీలో తన కుమారుడు సంతోష్ కుమార్తో కలిసి వైశ్యా నివసిస్తున్నారు.