స్టెరిలైట్ ఆందోళనలు: డీఎంకే నేత స్టాలిన్ అరెస్టు
స్టెరిలైట్ రాగి ఫ్యాక్టరీని మూసివేయాలని కోరుతూ.. స్థానికులకు మద్దతు ఇస్తూ డీఎంకే నేత ఎంకే స్టాలిన్ తమిళనాడు సెక్రటేరియట్ బయట తన అనుచరులతో కలిసి ధర్నా చేయగా.. పోలీసులు వారిని అరెస్టు చేశారు.
స్టెరిలైట్ రాగి ఫ్యాక్టరీని మూసివేయాలని కోరుతూ.. స్థానికులకు మద్దతు ఇస్తూ డీఎంకే నేత ఎంకే స్టాలిన్ తమిళనాడు సెక్రటేరియట్ బయట తన అనుచరులతో కలిసి ధర్నా చేయగా.. పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ మధ్యకాలంలో స్టెరిలైట్ ఉదంతానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో 13 మంది చనిపోగా.. 70మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
ఈ క్రమంలో ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మే 25వ తేదిన రాష్ట్ర వ్యాప్త బంద్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అయితే అంతకు ముందే ఈ రోజు తమిళనాడు సెక్రటేరియట్ వద్ద స్టాలిన్ ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో డీఎంకే కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు స్టాలిన్‌ను అరెస్టు చేసి తరలించారు.
అయితే స్టాలిన్‌ను తరలిస్తున్న పోలీసుల వాహనాన్ని డీఎంకే కార్యకర్తలు అడ్డుకున్నారు. వారిని పోలీసులు చెదరగొట్టారు. ఈ రోజు స్టెరిలైట్ ఉదంతంపై తూత్తుకూడి జిల్లా కలెక్టర్ సందీప్ నండూరి మాట్లాడారు. పరిస్థితిని సాధ్యమైనంత వరకు సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. షూటింగ్‌కు ఎవరు ఆదేశాలు ఇచ్చారన్న అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని.. దీనిపై తమిళనాడు ప్రభుత్వం నియమించిన న్యాయమూర్తి ఎంక్వయరీ వేస్తారని తెలిపారు.