సారీ.. జయలలిత వేలిముద్రలు షేర్ చేయలేం
గత సంవత్సరం తమిళనాడులో జరిగిన బై ఎలక్షన్లలో దరఖాస్తు చేసేటప్పుడు, మాజీ ముఖ్యమంత్రి జయలలిత వేలిముద్రలను అనైతికంగా ఆమెకు తెలియకుండా ఉపయెగించారని.. పిటీషన్ ఫైల్ అయిన క్రమంలో మద్రాసు హైకోర్టు స్పందించింది.
గత సంవత్సరం తమిళనాడులో జరిగిన బై ఎలక్షన్లలో దరఖాస్తు చేసేటప్పుడు, మాజీ ముఖ్యమంత్రి జయలలిత వేలిముద్రలను అనైతికంగా ఆమెకు తెలియకుండా ఉపయోగించారని పిటీషన్ ఫైల్ అయిన క్రమంలో మద్రాసు హైకోర్టు స్పందించింది. ఆ వేలిముద్రలను ఒరిజనల్ వేలిముద్రలతో పోల్చి చూడడం కోసం ఆధార్ కార్డులు మంజూరు చేసే యూఐడిఎఐ (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) సంస్థతో పాటు బెంగుళూరులోని పరప్పన అగ్రహార కారాగార అధికారులను హైకోర్టు సమాచారం కోరింది.
గతంలో పరప్పన కారాగారంలో కొన్ని రోజులు జయలలిత శిక్ష అనుభవించిన విషయం తెలిసిందే. అప్పుడు ఆమె వేలిముద్రలను వారు తీసుకోవడం జరిగింది. అలాగే, ఆధార్ కార్డుకి జయలలిత అప్లై చేసేటప్పుడు కూడా ఆమె వేలిముద్రలను అధికారులు తీసుకున్నారు. తాజా కేసులో హైకోర్టు వేలిముద్రలను కోరిన క్రమంలో పరప్పన కారాగార అధికారులు.. జయలలిత ఫింగర్ ప్రింట్లను కోర్టుకు అందించారు.
అయితే ఆధార్ సంస్థ మాత్రం వేలిముద్రల వివరాలు అందివ్వడానికి నిరాకరించింది. అలా పౌరుల వేలిముద్రలు బహిర్గతం చేయడం వల్ల సంస్థ నైతిక విలువలకు భంగం కలిగించినట్లవుతుందని..పౌరుల ఆధార్ వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ కూడా బహిర్గతం చేయకూడదనే నియమం ఆధార్ సంస్థ నియమ నిబంధనలలో ఉందని, యూఐడిఎఐ అధికారులు హైకోర్టుకి తెలియజేశారు.