న్యూఢిల్లీ: ఆధార్ పరిశీలన కోసం వేలిముద్రలు, కనుపాపలతో పాటు ముఖ గుర్తింపు సదుపాయాన్ని ఈ ఏడాది జులై ఒకటో తేదీ నుంచి అందుబాటులోకి తీసుకురావాలని 'భారత విశిష్ట  గుర్తింపు  ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ)' రంగం సిద్ధం చేస్తోంది. జూలై 1 నుంచే ఈ విధానం అమల్లోకి రానుంది. వేలిముద్రలు చెరిగిపోయిన, మసకబారిన వంటి సమస్యల వల్ల బయోమెట్రిక్ వివరాల ధృవీకరణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికోసం ఇలాంటిది తీసుకువస్తామని జనవరిలోనే యూఐడీఏఐ ప్రకటించిన సంగతి తెలిసిందే..!ఇటీవల సుప్రీం కోర్టుకు కూడా ఈ విషయాన్ని నివేదించింది. అయితే ఆధార్‌ ధ్రువీకరణకు ముఖం ఒక్కటే సరిపోదని యూఐడీఏఐ పేర్కొంది. దీనికి అదనంగా వేలిముద్రలు, కంటిపాప, వన్‌టైం పాస్‌వర్డ్‌(ఓటీపీ)ల్లో ఒకదాన్ని కూడా సరిపోల్చాల్సి ఉంటుందని స్పష్టతనిచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నా మాటను తప్పుగా అర్థం చేసుకున్నారు: అల్ఫోన్స్


ఆధార్ డేటా విషయంలో తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంపై కేంద్ర పర్యాటక సహాయమంత్రి అల్ఫోన్స్ కన్నాంథమ్ వివరణ ఇచ్చారు. ఆధార్ డేటా లీక్ కాదని, దీనిపట్ల భారతీయులు అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. అంతకు ముందు 'మనవారు విదేశాలకు వెళ్లేందుకు పేజీలకు పేజీల వీసా దరఖాస్తు నింపుతారు, వేలిముద్రలిస్తారు. కానీ భారత ప్రభుత్వం ఆధార్ అంటే మాత్రం గగ్గోలు పెడతారు' అని అల్ఫోన్స్ అన్నారు.