AAP MP Candidates: ఇండియా కూటమి కూలినట్టేనా? ఆమ్ ఆద్మీ పార్టీ మరో సంచలన నిర్ణయం
Asssam APP Candidates: ఇండియా కూటమిలో కాంగ్రెస్ ఒంటరిదైపోతున్నట్టు కనిపిస్తోంది. పశ్చిమబెంగాల్, యూపీ, పంజాబ్, ఢిల్లీలో టీఎంసీ, ఎస్పీ, ఆప్ ఒంటరిగా పోటీ చేయాలని భావిస్తుండగా తాజాగా అస్సాంలోనూ ఆప్ ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అభ్యర్థులను ప్రకటించింది.
Assam Aam Admi Party Candidates: దేశంలో కీలకమైన ప్రతిపక్ష ఇండియా కూటమిలో చీలికలు భారీగా వస్తున్నాయి. ఇప్పటికే తృణమూల్, జేడీయూ దూరమైన విషయం తెలిసిందే. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ దూరమవుతున్నది. ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్‌లో షాక్ ఇచ్చిన ఆప్ తాజాగా అస్సాంలోనూ అదే ధోరణిని కొనసాగించింది. కాంగ్రెస్‌తో పొత్తు కాకుండా ఒంటరిగా లోక్‌సభలో పోటీ చేస్తామని ప్రకటించింది. ఈ సందర్భంగా అస్సాంలోని పలు లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఆప్ తాజా నిర్ణయంతో ఎన్నికల వరకు ఇండియా కూటమితో ఆప్ దూరంగా ఉండేటట్టు కనిపిస్తోంది.
అస్సాంలో 14 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో మూడు స్థానాలకు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. దిబ్రుగడ్ నుంచి మనోజ్ ధనోవర్, గుహవాటి నుంచి బాబెన్ చౌదరి, తేజ్‌పుర్ నుంచి రిషిరాజ్ కౌంటిన్యను అభ్యర్థులుగా ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సందీప్ పాఠక్ ప్రకటించారు. ఢిల్లీ, పంజాబ్ తర్వాత ఆప్ అస్సాంపై పూర్తి దృష్టి సారించింది. ఇక్కడ సత్తా చాటేందుకు ఎప్పటి నుంచో పని చేస్తున్న ఆమ్ ఆద్మీ సార్వత్రిక ఎన్నికలను పూర్తిగా సద్వినియోగించుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే అస్సాంలోని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగతా స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.
Also Read: Revanth Reddy: నిరుద్యోగుల్లారా పోటీ పరీక్షలకు సిద్ధం కండి: సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
కాగా ఇండియా కూటమిపై ఆప్ జాతీయ కార్యదర్శి సందీప్ పాఠక్ స్పందించారు. 'అస్సాంలో సీట్ల పంపకాలపై కాంగ్రెస్‌ను పలుమార్లు కోరినా స్పందన లేదు. అక్కడి నుంచి స్పందన రాకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో అభ్యర్థులను ప్రకటించాం. బీజేపీని ఓడించడానికి పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాల్సి ఉంది. అభ్యర్థులను ఖరారు చేసి ప్రజల్లోకి వెళ్లే వీలుంటుంది. ఈ విషయాన్ని కాంగ్రెస్‌కు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేకపోయింది' అని తెలిపారు. ప్రస్తుతం ఆప్ ప్రకటించిన మూడు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. కాకపోతే అక్కడ ఇప్పుడు బీజేపీ సిట్టింగ్‌లో ఉంది.
2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అస్సాంలోని 14 స్థానాల్లో బీజేపీ 9 కైవసం చేసుకోగా.. కాంగ్రెస్ మూడింటిని సొంతం చేసుకుంది. రెండు చోట్ల అక్కడి స్థానిక పార్టీలు గెలిచాయి. అస్సాంపై పూర్తి దృష్టి సారించిన ఆప్ రానున్న లోక్‌సభ ఎన్నికలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుపొందాలనే కసితో పని చేస్తోంది. కాగా అస్సాంలో బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటుండగా దాన్ని తనవైపునకు తిప్పుకోవాలని ఆప్ ప్రణాళికలు వేస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook