కర్ణాటక ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఘోరపరాజయం ఎదురైంది. రాష్ట్రంలో పార్టీ పోటీ చేసిన 29 స్థానాల్లో పార్టీ అభ్యర్థులు ఓటమిపాలవడమేకాకుండా అన్ని స్థానాల్లోనూ పార్టీకి డిపాజిట్స్ గల్లంతయ్యాయి. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో పార్టీ తరపున 29 మంది అభ్యర్థులు కర్ణాటక ఎన్నికల బరిలో నిలిచినప్పటికీ ఒక్క స్థానంలోనూ పార్టీకి డిపాజిట్ దక్కలేదు. మంగళవారం ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం ఆ పార్టీ కర్ణాటక రాష్ట్ర కన్వినర్ పృథ్వీ రెడ్డి మీడియాతో మాట్లాడుతు.. '' రాష్ట్రంలో తమకు చాలా మద్ధతు లభించింది. కానీ ఎందుకో ఆ మద్దతు ఓట్లుగా మారలేదు. తాము ఎందుకు ఓడిపోయామో ఇప్పటివరకు అర్థం కావడం లేదు'' అని విస్మయం వ్యక్తంచేశారు. 


సర్వజ్ఞనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత కేజే జార్జ్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ తరపున పోటీ చేసిన పృథ్వీ రెడ్డికి కేవలం 1,861 ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి. శాంతినగర్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరపున పోటీ చేసిన రేణుక విశ్వనాథన్ సైతం ఘోర పరాజయం పాలయ్యారు.